బీజేపీలో జేడీపీ విలీనం
జంషెడ్పూర్: బీజేపీ మాజీ నేత సల్ఖాన్ ముము నేతృత్వంలోని జార్ఖండ్ దిసోమ్ పార్టీ (జేడీపీ) సోమవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సమక్షంలో జంషెడ్పూర్లో జేడీపీ విలీనం జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీని తమ నేతగా ప్రజలు ఆమోదిస్తున్నారని, పలు పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తంచేస్తున్నారని ఈ సందర్భంగా అర్జున్ ముండా చెప్పారు.
జేడీపీతో కొంతకాలంగా జరుగుతున్న విలీనం చర్చలు,..ఆ పార్టీ అధ్యక్షుడు సల్ఖాన్ ముముతో ఆదివారం జరిగిన చర్చలతో తుదిరూపు దాల్చాయన్నారు. విలీనం వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదని, బీజేపీ ఆధ్వర్యంలో ఆశయాలు సాధించుకునేందుకు తమ పార్టీ వ్యూహం మార్చిందని సల్ఖాన్ ముము చెప్పారు.
రేపు జేవీఎం విలీనం: ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా (జేవీఎం-ప్రజా తాంత్రిక్) పార్టీ ఈ నెల 20న బీజేపీలో విలీనం కాబోతోందని అర్జున్ ముండా చెప్పారు.