మతీన్ భార్యకు ముందే తెలుసట
ఆర్లెండో కాల్పుల ఘటనలో కొత్త మలుపు
న్యూయార్క్: ఆర్లెండోలోని నైట్ క్లబ్లో మతీన్ కాల్పులు జరుపుతాడన్న విషయం అతని భార్యకు ముందే తెలుసా? మతీన్ తూటాలు కొన్నప్పుడు ఆమె అతని పక్కనే ఉందా..? అవుననే అంటున్నారు ఎఫ్‌బీఐ అధికారులు. మతీన్ క్లబ్లో కాల్పులు జరుపుతాడన్న విషయం మతీన్ రెండో భార్య నూర్ జాహీ సల్మాన్(30)కు ముందే తెలుసనిభావిస్తున్నారు. మతీన్ తూటాలు కొనుగోలు చేసినప్పుడు తాను పక్కనే ఉన్నానని సల్మాన్ ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పినట్లు ఎన్బీసీ న్యూస్ వెబ్సైట్ ఓ కథనం ప్రచురించింది. కథనం ప్రకారం.. గే నైట్ క్లబ్‌కు ఓసారి మతీన్‌ను తీసుకెళ్లి తాను దింపినట్టు ఆమె ఎఫ్‌బీఐకి చెప్పింది.
దాడికి సంబంధించి తాను మతీన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానంది. మతీన్ దాడికి సంబంధించి ప్రణాళికలను తనతో పంచుకునే వాడని పేర్కొంది. కాగా, నైట్ క్లబ్లో కాల్పులు జరిపాక అక్కడి నుంచే మతీన్.. సల్మాన్‌కు ఫోన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. సెనేటర్ అంగస్ కింగ్ కేసు అంశాలను వెల్లడిస్తూ.. ఏం జరుగుతుందో సల్మాన్‌కు కొంత సమాచారం తెలుసన్నారు. కాల్పుల విషయం ముందే తెలిసినా పోలీసులకు చెప్పని సల్మాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అధికారులు భావి స్తున్నారు. అర్లాండో ఘటన నేపథ్యంలో మారణాయుధాలపై నిషేధాన్ని పునరుద్ధరించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్‌ను కోరారు.