నీరు + ఉప్పు = వెలుగు!
గ్లాసుడు నీళ్లు, రెండు చెమ్చాల ఉప్పు... ఫొటోలో కనిపిస్తున్న లాంతరు ఏకబిగిన ఎనిమిది గంటల పాటు వెలుగులు ఇచ్చేందుకు కావాల్సినవి ఇవి మాత్రమే! కరెంటు లేకపోయినా, బ్యాటరీల చార్జింగ్ అయిపోయినా ఫర్వాలేదు. ఈ ‘సాల్ట్’ బల్బ్ ఎక్కడైనా సరే వెలుగులు పంచుతుంది. ఫిలిప్పీన్స్ లోని సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్ క్లుప్తంగా ‘సాల్ట్’ అభివృద్ధి చేసిన ఈ లాంతరు వెలుగులతోపాటు అవసరమైనప్పుడు సెల్‌ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది కూడా!
దాదాపు ఏడువేల ద్వీపాలతో కూడిన ఫిలిప్పీన్స్‌లో 1.6 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదట. ఈ సమస్యను ‘సాల్ట్’ తెలివిగా పరిష్కరిస్తుంది. ఎల్ఈడీ బల్బులతో కూడిన ఈ లాంతరు నిజానికి ఒక రకమైన బ్యాటరీ. ఉప్పునీటిని ఎలక్ట్రోలైట్‌గా వాడుకుంటూ కొంచెం తక్కువ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎల్ఈడీ బల్బులు వెలుగుతాయి. భలే ఐడియా కదూ!