salt harvesting
-
కాసుల వర్షం కురిపిస్తోన్న ‘తెల్ల బంగారం’
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు. 50 ఏళ్లలో అత్యధికం ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర ఉప్పు సరఫరా అవుతోంది. పెరిగిన కూలి ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండటంతో కూలీలకు కూలి సైతం పెరిగింది. ఇప్పటి వరకు కొఠారుల్లో మూడు గంటలు పనిచేస్తే పురుషులకు రూ.400 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, మహిళలకు రూ.300 ఇస్తుండగా రూ.350 పెరిగిందని రైతులు తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో.. ఈ ప్రాంతంలో వ్యాపారుల సిండికేట్ కారణంగా ఉప్పు రైతులకు ఆశించిన ధర చేతికి వచ్చేది కాదు. కానీ ఈ ఏడాది తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో ధరలు ఆశాజనంగా పెరిగాయని ఉప్పు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు నేరుగా రావటంతో ఇప్పటివరకు సిండికేట్తో వ్యాపారులు లాభపడుతుండగా ఇప్పుడు రైతులే ఆ లాభాలను పొందుతున్నారు. ఉప్పును కూడా ఆర్బీకేల కొనుగోలు చేస్తే మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పు తయారీ బాగుంది. తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో మంచి ధరలు వస్తున్నాయి. – పురిణి శ్రీనివాసులరెడ్డి గతంలో ఎప్పుడూ ఈ ధర లేదు 50 ఏళ్లలో ఎన్నడూ ఈ ధర లేదు. గతంలో వ్యాపారుల సిండికేట్, వర్షాభావ పరిస్థితులతో గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోయేవాళ్లం. రెండేళ్లుగా ధరలు ఆశాజ నకంగా ఉండటంతో సాగు లాభదాయకంగా ఉంది. – కుర్రి నరసింహారావు -
ఉప్పు రైతుల్లో..కలవరం
బరంపురం : గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శుక్రవారం జారీ చేసిన హెచ్చరికలతో జిల్లాలోని ఉప్పు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వారం రోజులుగా పడుతున్న అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉప్పు రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులతో కురిసిన తేలికపాటి వర్షాలకే చాలా నష్టపోయాం. ఇప్పుడు ఐఎండీ(ఇండియన్ మెట్రాలజీ డివిజన్) జారీ చేసిన హెచ్చరికలతో భయాందోళనకు గురవుతున్నామని వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. పదివేల కుటుంబాలకు ఆధారం జిల్లాలో సుమారు 10వేల ఉప్పు రైతుల కుటుంబాలున్నాయి. రెండువేలకు పైగా ఎకరాల్లో ఉప్పు పంటను సాగుచేస్తున్నారు. వీరికి ఉప్పు పంట తప్ప ఇంకో జీవనాధారం లేదు. వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షాలు పడితే పంట మొత్తం నీట మునిగి నాశనమైతే జీవనం సాగించడం కూడా కష్టతరంగా మారుతుంది. రెండువేల ఎకరాల్లో పండించిన పంటలో సుమారు 40 శాతం పంటను తీశామని రైతులు చెబుతున్నారు. ఇంకా 60 శాతం ఉండిపోవడంతో తీవ్ర అందోళనకు గురవుతున్నామన్నారు. గతంలో వచ్చిన ఫైలీన్ తుఫాన్ ప్రభావానికి రెండు వేల ఎకరాల్లో పంట మొత్తం నీట మునగడంతో తీవ్ర నష్టపోయామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలి జనవరి మొదటి వారంతో ప్రారంభమయ్యే ఉప్పు సీజన్ జూన్ మొదటి వారంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఎండ అధికంగా తగలితే ఉప్పు పంట దిగుబడి మరింతగా వస్తుంది. ధర కూడా ఆశాజనకంగా ఉన్న తరుణంలో వారం రోజులుగా పడిన వర్షాలకు పంట నష్టంతో పాటు ధర కూడా తగ్గిపోయింది. దీనికి తోడు సోమవారం నుంచి వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి సారించి తగు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఉప్పు రైతులను ఆదకోవాలని ఉప్పు సహకార సమితి కార్యదర్శి బొటొ కృష్ణ రెడ్డి విజ్ఙప్తి చేస్తున్నారు. -
ఉప్పు రైతు డీలా!
- ధరల పతనంతో ఆందోళన - పెట్టుబడులు దక్కని వైనం - పేరుకుపోయిన ఉప్పు నిల్వలు సింగరాయకొండ : ఉప్పు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలో ఊళ్లపాలెం, పాకల, బింగినపల్లి ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఉప్పు పండిస్తున్నారు. పాకలలో సుమారు 100 ఎకరాలు, ఊళ్లపాలెంలో సుమారు 2,700, బింగినపల్లిలో 1200 ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని భూములను లీజుకు తీసుకుని రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎండల కారణంగా ఉప్పు తయారీ గణనీయంగా పెరగడంతో ధరలు పడిపోవమేకాక, ఉత్పత్తికి తగ్గ అమ్మకాలు లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. 70 కిలోల బస్తా ఉప్పు తయారీకి సుమారు రూ.90 ఖర్చవుతుండగా, ప్రస్తుతం మేలు రకం ఉప్పు బస్తా ధర రూ.75 మాత్రమే పలుకుతోంది. నాణ్యత కొంచెం తగ్గిన ఉప్పు బస్తా ధర రూ.50గా ఉంది. ప్రస్తుతం ఉప్పు ధరకు, తయారీ ఖర్చుకు పొంతన లేకపోవడంతో నష్టానికి అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత భూములున్న కొందరు రైతులు ఉప్పు పండించడం మానుకోగా, లీజుదారులు మాత్రం ఉప్పు సాగు చేసినా, మానేసినా ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన కూలి రేట్లు, డీజిల్ ధరలతో ఉప్పు తయారీ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు తీవ్రంగా ఎండలు కాస్తుండడంతో తయారయ్యే ఉప్పు చేదుగా ఉంటోందని, ఇది అమ్మకానికి పనికి రాదని ఉప్పు రైతులు తెలిపారు. సాధారణంగా జూన్ నాటికి రాష్ట్రం మొత్తం మీద కొన్నిప్రాంతాల్లోనైనా వర్షాలు పడేవని, దీనివల్ల మిగతా చోట్ల తయారైన ఉప్పుకు డిమాండ్ ఉండేదని, ప్రస్తుతంలో రాష్ట్రంలో ఎక్కడా వాన జాడ లేకపోవడంతో అన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉత్పత్తి జరిగి ఎగుమతులు లేవని ఉప్పు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఎప్పుడు పడతాయో, గిట్టుబాటు ధర లభించి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
నీరుగారిన ఉప్పు రైతు
సంతబొమ్మాళి, న్యూస్లైన్: ప్రకృతి వైపరీత్యాలతో ఉప్పు రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్ల నుంచి అతలాకుతలమవుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఉప్పురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. మండలంలోని నౌపడ, భావన పాడు, మర్రిపాడు, యామలపేట, మూలపేట, లింగూడు పంచాయతీల్లో సుమారు 4800 ఎకరాల్లో ఉప్పును సాగు చేస్తున్నారు. ఉప్పు పంట సీజన్ కావడంతో డిసెంబర్ నుంచి మే వరకు ఉప్పు సాగు చేస్తారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు ఉప్పు కరిగిపోవడంతో ఆరు నెలల తమ శ్రమ నీటిపాలైందని వాపోతున్నారు. గతంలో పైలీన్ తుపానుతో నష్టం వాటిల్లినపుడు ఎకరాకు రూ.9 వేల పరిహారం కోరితే రూ.4 వేలు చెల్లించాలని అధికారులు ప్రతిపాదించారని, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదని చెప్పారు. లైలా, నీలం, జల్ తుపాన్లకు సంబంధించి ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు. తమకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.