ఉతికి జాడించేశారు!
ప్రపంచం
ఉతికి, జాడించడంలో ఆడవాళ్ల తర్వాతే ఎవరైనా. ఆ సంగతి ఇండోనేషియాలోని ‘శాల్వో స్పోర్ట్’ కంపెనీ యజమానులకు బాగా తెలిసివచ్చినట్లుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా... ‘‘అమ్మ తల్లులూ, మమ్మల్ని అపార్థం చేసుకున్నట్లున్నారు! క్షమించి వదిలేయండి’’ అని లెంపలేసుకున్నారు. అంతగా అక్కడి ఆడవాళ్లకు కోపం రావడానికి కారణం ఏమిటిటంటే... స్థానికంగా పేరున్న ఒక ఫ్లయిట్ సాకర్ క్లబ్బు కోసం శాల్వో గత నెలలో ఒక జెర్సీ షర్ట్‌ను డిజైన్ చేసి ఇచ్చింది. షర్ట్ లోపల దానిని ఎలా ఉతకాలో సూచనలు కూడా ఇచ్చింది. ఆ సూచనలు కూడా ఎన్నో లేవు. సింపుల్‌గా రెండంటే రెండే ఉన్నాయి.
ఒకటి: ఈ జెర్సీని మీ ఆవిడతో ఉతికించండి.
రెండు: అది ఆవిడ పని.
‘బట్టలు ఉతకడం మహిళల పనే పని’ అర్థం వచ్చేలా ఉన్న ఈ సూచనల్ని ఎవరో ఫొటో తీసి సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు ఎక్కించారు. అలా అలా అది నెట్ అంతా వ్యాపించింది. దీంతో ఇండోనేషియా మహిళల్లో కదలిక వచ్చి ‘శాల్వో’ కంపెనీ తీరుపై విరుచుకుపడ్డారు.
అప్పుడు గానీ శాల్వోకు తన తప్పేమిటో అర్థం కాలేదు. ‘‘ఈ సూచనలను మేము పురుషులను ఉద్దేశించి మాత్రమే ఇచ్చాం. ‘తెలియని పని చేసి షర్ట్‌ను నాశనం చేయకండి. ఆడవాళ్లకయితే ఉతకడంలో మెళకువలు తెలిసుంటాయి కనుక వారికే ఇవ్వండి’ అని చెప్పాలనుకున్న మా ప్రయత్నం ఇలా అపార్థానికి దారి తీసినందుకు బాధపడుతున్నాం’’అని ఒక ప్రకటన విడుదల చేసి, సారీ చెప్పింది.