శల్య సారథ్యం!
సాక్షి ప్రతినిధి, కడప:జిల్లాలో ప్రజావిశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నేతలు శల్యసారధ్యం చేస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అభివృద్ధి పనులకు చెంది రూ.2.72 కోట్ల నిధుల అనుమతికి బ్రేకులు వేస్తున్నారు. మొత్తానికి కార్పొరేషన్ పాలకపక్షంపై అధికార యంత్రాంగం నిరంకుశదోరణి ప్రదర్శిస్తోంది.
2011-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు చెందిన బీఆర్జీఎఫ్ నిధులకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. ఆమేరకు వివిధ పనులకు చెంది కడప కార్పొరేషన్ పరిధిలో 9పనులకుగాను రూ.2.72కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. అనుమతి మంజూరైన ఆ పనుల స్థానంలో కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ పనులను ప్రతిపాధించారు. ఆమేరకు అనుమతించాల్సింది గా జెడ్పీ సీఈఓ మాల్యాద్రికి సెప్టెంబర్ 8న లేఖ రాశారు.
తెరవెనుక మంత్రాంగంలో దేశం నేతలు....
జెడ్పీ సీఈఓను అడ్డుపెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు శిఖండి రాజకీయాలు చేస్తోంది. కడప కార్పొరేషన్ పరిధిలో మంజూరైన పనుల స్థానంలో ప్రత్యామ్నాయ పనులకు పాలక మండలి తీర్మానం చేసింది. నగర మేయర్ సురేష్‌బాబు ఆదేశాల మేరకు కమిషనర్ ఓబులేసు సెప్టెంబర్8న జెడ్పీ సీఈఓ మాల్యాద్రికి లేఖ రాశారు. రెండు నెలలు పూర్తి గడిచినా ఇప్పటికీ అనుమతి ఇవ్వకుండా మాల్యాద్రి తాత్సారం చేస్తున్నారు.
ఇందులో అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ సీఈఓ మాల్యాద్రి సైతం అందుకు వత్తాసుగా నిలుస్తుండటంతో అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే బీఆర్జీఎఫ్ గ్రాంటులో పనులు చేపట్టినా, కార్పొరేషన్ పరిధిలో నోచుకోలేదు. పాలకపక్షం ఇప్పటికే అనేక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతంగా చేస్తోంది. ఈనేపధ్యంలో అభివృద్ధికి ఆటంకం కల్గిస్తూ దేశం నేతలు శల్యసారధ్యం చేస్తున్నారు.
కాసుల కక్కుర్తితోనే..
అధికారపార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది, అయినప్పటికీ అనుమతి ఇవ్వగలం.. అయితే మా వాటా అందిస్తే అనుమతి ఇస్తామని జెడ్పీలో పనిచేస్తున్న కీలక అధికారి ఒకరు కార్పొరేషన్ యంత్రాంగంతో పేర్కొన్నట్లు సమాచారం. ఆమేరకే పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి పనులను ఉన్నతాధికారులు ప్రోత్సహించాల్సిందిపోయి, కమిషన్లకు కక్కుర్తిపడటం విడ్డూరంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా బీఆర్జీఎఫ్ నిధుల విషయంలో అనుమతి నిరాకరణపై జెడ్పీ సీఈఓ మాల్యాద్రి వివరణ కోరగా నగర కమిషనర్ పంపిన ప్రత్యామ్నాయ పనులు బీఆర్జీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పెండింగ్‌లో ఉంచామన్నారు. అంతకు మించి మరో కారణం లేదన్నారు. రెండు నెలలు దాటినా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే అనుమతి ఇవ్వలేదని సీఈఓ మాల్యాద్రి తెలియజెప్పకపోవడం మరీ విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.