ఫేక్ పోస్టింగ్.. ప్రతిపక్ష నేతకు ఐదేళ్ల జైలు!
ఫెనాం పెన్హ్ : సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చేసిన కేసుకు సంబంధించి కంబోడియా ప్రతిపక్ష నేత శామ్ రెయిన్సీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. సరిహద్దు దేశమైన వియత్నాంతో కొన్ని ఒప్పందాలు, సరిహద్దు విషయమై సంప్రదింపులకు అంగీకరించినట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఫెనాం పెన్హ్ మున్సిపల్ కోర్టు నేడు విచారణ జరిపి శిక్ష ఖరారుచేసింది. గత కొన్ని నెలలుగా అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ పార్టీ నేత, ప్రధాని హన్ సేన్, ప్రతిపక్ష పార్టీ కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మధ్య ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. వియత్నాం, కంబోడియా దేశాల నేతలలో శామ్ రెయిన్సీ టీం చేసిన ఫేక్ పోస్ట్ కలవరం పుట్టించింది. ఇరుదేశాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు.
2013 లో జరిగిన ఎన్నికల్లో శామ్ రెయిన్సీ నేతృత్వం వహించిన కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీ 55 సీట్లు కైవసం చేసుకోగా, అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ 68 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలసిందే. 1979లో జరిగిన బోర్డర్ ఒప్పందాలపై శామ్ రెయిన్సీతో పాటు అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ దుష్ప్రచారం చేశారని నిర్ధారించారు. శామ్ రెయిన్సీకి ఐదేళ్లు శిక్షపడగా, అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ లకు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. కాగా, పరువునష్టం దావాకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ రెయిన్సీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని 2015లో ఫ్రాన్స్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని మున్సిపల్ కోర్టు తీర్పిచ్చింది.