ఉద్యమంగా హరిత హారం
* ఆకుపచ్చ తెలంగాణ అందరి లక్ష్యం కావాలి: సీఎం కేసీఆర్
* మన బిడ్డల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి
* రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్
* ‘కాళేశ్వరం’తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా
* సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంది
* వేల్పూరు నుంచే కేజీ టు పీజీ ఉచిత విద్య
* కామారెడ్డిని జిల్లాగా చేస్తా
* నిజామాబాద్ జిల్లాలో సీఎం హరితహారం
* దేశానికే ఆదర్శం: జవదేకర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి, జట్టుకట్టి ఉద్యమించిన ప్రజలు.. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మరో ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పాలకుల పాలనలో ముందుచూపు లేక తెలంగాణలో అడవులు అంతరించిపోయాయని, అందువల్లే ఈ నీళ్ల గోస ఏర్పడిందని అన్నారు. పల్లె నుంచి పట్నం దాకా ఉద్యమ స్ఫూర్తితో అందరూ మొక్కలు నాటాలని, అందరి లక్ష్యం ఆకుపచ్చ తెలంగాణ కావాలని పేర్కొన్నారు. గోదావరి జలాలు సద్వినియోగం చేయడం కోసం ఇంజినీర్లతో ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించానని, ఇంకా కొందరు మంత్రులకే ఈ విషయం తెలియదని, ఆమోదం కోసం త్వరలోనే కేబినెట్లో పెడతానని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజీ టు పీజీ పథకాన్ని నిజామాబాద్ జిల్లా వేల్పూరు నుంచే ప్రారంభిస్తానని, హైదరాబాద్‌కు వెళ్లాక సాంకేతిక కారణాలపై చర్చించి దీనిపై ప్రకటిస్తానని వెల్లడించారు. కామారెడ్డి మంచి ఆర్థిక నగరంగా ఎదుగుతుందని, దీన్ని నూటికి నూరు శాతం జిల్లాగా చేసి తీరుతానని స్పష్టంచేశారు.
230 కోట్ల మొక్కలు నాటుతాం
హరితహారంలో భాగంగా సీఎం సోమవారం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. వేల్పూరు మండలం మోతె నుంచి మొదలైన పర్యటన కామారెడ్డి వరకు సాగింది. మోతె, వేల్పూరు, ఆర్మూరు, నిజామాబాద్, ధర్నారం, సదాశివనగర్, కామారెడ్డిలలో ఆయన పలుచోట్ల మొక్కలు నాటారు. మోతె, వేల్పూరు, నిజామాబాద్, కామారెడ్డిలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలంగాణలో మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచంలో అత్యధికంగా మొక్కలు నాటిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. గ్రామాలను పచ్చగా చేసే బాధ్యత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీసుకోవాలన్నారు. ‘‘నిజామాబాద్ జిల్లాలో అడవులను నాశనం చేయడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఆరుద్ర కార్తె. ఇప్పుడెట్ల ఉండాలే... వానలు, ముసుర్ల జోరుండాలే. కాని ఎండకాలంలా ఎండలు కొడ్తున్నయ్. అందుకనే మనం అందరం మన బిడ్డల భవిష్యత్ కోసం మొక్కలు నాటాలే. జనం మధ్యకు చేరిన కోతులు వాపసు పోవాలే. వానలు మళ్లీ రావాలే’’ అన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానం
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. సంక్షేమ రంగానికి దేశంలో నెలకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలంగాణే అన్నారు. ‘‘గతంలో దొడ్డు సీఎంలు ఉండేవారు. వారు సంక్షే మ విద్యార్థులకు దొడ్డు బి య్యం అందించారు. నేను సన్న గా ఉన్నా.. సన్న బియ్యూన్నే ఇస్తు న్నా..’’ అంటూ చమత్కరించారు. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత 24 గంటల త్రీఫేజ్ కరెంటు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ఎండిపోయిందని దీనికి గత పాలకులే కారణమన్నారు. సింగూరు నుంచి జిల్లాకు నీటిని తీసుకువస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేస్తానని, ఆ పథకం ద్వారా నిజామాబాద్‌లోని ఆర్మూర్, బాల్కొండ, కా మారెడ్డి, ఎల్లారెడ్డిలకు నీరందిస్తామన్నారు. 30 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఎలా ఉండేదో అలా తీర్చిదిద్ది నంబర్ వన్ చేస్తానన్నారు. రాష్ట్రంలో రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లను అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు ఒక్కో కార్పొరేషన్‌కు ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.
మోతె నా ఊరు!
‘తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన ఊరు మోతె. ఉద్యమ తొలినాళ్లలో నాకు అండగా నిలిచింది ఈ ఊరే. అలాంటి మోతె నా ఊరు కాకపోతే ఏమవుతది. ముమ్మాటికీ మోతె కేసీఆర్ గ్రామం. మోతె అభివృద్ధికి నాదే పూచీ. ఇక్కడ ఏం చేయకపోయినా నా ఇజ్జతే పోతది. అందుకే మోతెను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా’ అని సీఎం చెప్పారు. మోతె మట్టిని తీసుకెళ్లి తెలంగాణ అన్ని జిల్లాల్లోని బావుల్లో కలిపితే బాగుంటుందని, అలా చేస్తే తెలంగాణలోని కొందరు సన్నాసులకు మోతె ప్రజలకున్న తెలంగాణ స్ఫూర్తి వస్తుందన్నారు. గ్రామంలోని రైతులందరికీ 100% రాయితీపై బిందుసేద్య పరికరాలు అందజేస్తామని, ఇల్లు లేని పే దలకు రెండు పడక గదులతో 200 ఇళ్లు మంజూరు చేస్తానని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాలుగు నెలల్లో రెండస్తుల పంచాయతీ భవనం నిర్మిస్తామన్నారు. మురుగు కాల్వల నిర్మా ణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశానికే ఆదర్శం: జవదేకర్
తెలంగాణలో సాగుతున్న హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. మోతె, వేల్పూరు, ఆర్మూరులో జరిగిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం దేశంలో మరెక్కడా జరగడం లేదన్నారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను స్వయంగా చూశానని, అదే తరహాలో ఇప్పుడు హరితహారం ఉద్యమం చూస్తున్నానన్నారు.