సెలవులు తీసేసుకున్నారు
తెరుచుకోని అంగన్వాడీ కేంద్రాలు
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్‌లో శుక్రవారం అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోలేదు. శ్రీసమ్మక్క- సారలమ్మ జాతర నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి సెలవులు ప్రకటించలేదు. అయినా కేంద్రాల నిర్వాహకులు మాత్రం సెలవులు తీసేసుకున్నారు. రెండు రోజులుగా కేంద్రాలు తెరవడం లేదంటూ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పదిగంటలకు ‘సాక్షి ’ బసంత్‌నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాలను విజిట్ చేసింది. స్థానిక కమ్యూనిటీ హాల్ సమీపంలోని కేంద్రంతోపాటు సుభాష్‌నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని కేంద్రం, రాజీవ్ నగర్(ఒడ్డెర కాలనీ)లోని అంగన్వాడీ కేంద్రాలు తాళం వేసి దర్శనమిచ్చాయి. రాజీవ్‌నగర్ కేంద్రం వద్ద ఇద్దరు చిన్నారులు నిర్వాహకుల కోసం ఎదురుచూస్తూ కనిపించారు. ఈ విషయమై అంగన్వాడీ మండల సూపర్వైజర్ జమునను వివరణ కోరగా ప్రభుత్వం కేంద్రాలకు ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదని, జాతరకు వెళ్లాలనుకునే వారు లీవ్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే బసంత్‌నగర్‌లోని ఐదు కేంద్రాల్లో కేవలం రెండో కేంద్రం ఆయా మాత్రమే లీవ్ అనుమతి తీసుకున్నట్లు జమున పేర్కొన్నారు. మిగతా వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదని వివరించారు.