ఐఎస్ఐఎస్ 'పోస్టర్ గర్ల్'ను చంపేశారు!
లండన్: ఐఎస్ఐఎస్ 'పోస్టర్ గర్ల్'గా పేరొందిన 17 ఏళ్ల సమ్రా కెసినోవిక్ను ఆ ఉగ్రవాద గ్రూపే హతమార్చినట్టు తెలుస్తున్నది. సమ్రా కెసినోవిక్ గత ఏడాది ఆస్ట్రియా రాజధాని వియాన్నాలోని తన ఇంటి నుంచి పారిపోయి.. స్నేహితురాలు సబినా సెలిమోవిక్ (15)తో కలిసి సిరియా వచ్చింది. అక్కడ ఐఎస్ఎఐస్లో చేరి.. ఆ గ్రూపు సాయుధులతో కలిసి ఫొటోలు దిగింది. కలాష్నికోవ్ తుపాకులు పట్టుకొని ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియా వెబ్సైట్లో హల్చల్ చేశాయి. కొంతకాలానికే సమ్రా ఐఎస్ఐఎస్ గ్రూప్ ప్రతినిధిగా సోషల్ మీడియాలో ప్రచారమైంది.
అయితే ఐఎస్ఐఎస్ అరాచకాలతో విసిగిపోయిన సమ్రా గ్రూపు నుంచి తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించిందని, దీంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఆమెను చంపేశారని ఆస్ట్రియా మీడియా సంస్థలు తెలిపాయి. ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతమైన రఖ్కాలో ఆ గ్రూపు చేస్తున్న బహిరంగ హత్యలను చూసి బెదిరిపోయిన సమ్రా తప్పించుకోవడానికి ప్రయత్నించిందని, దీంతో ఉగ్రవాదులు ఆమెను పట్టుకొని హత్య చేశారని తమ కథనాల్లో పేర్కొన్నాయి. సమ్రా లాగే ట్యూనిషియా నుంచి పారిపోయి ఐఎస్ఐఎస్లో చేరిన ఓ మహిళ ఈ వివరాలు తెలిపిందని, ఐఎస్ఐఎస్లో సమ్రాతోపాటు పనిచేసిన ఆ మహిళ తర్వాత ఆ గ్రూపు నుంచి తప్పించుకొని ఇంటికి చేరిందని తెలిపాయి.