స్మార్ట్ఫోన్ల జోరు
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెట్టింపవుతుందని శామ్సంగ్ కంపెనీ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లుగా ఉన్న స్మార్ట్ఫోన్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నామని శామ్సంగ్ మొబైల్ అండ్ ఐటీ ఇండియా హెడ్ వినీత్ తనేజా చెప్పారు.
భారత వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయనున్నారన్న అంచనాలున్నాయని వివరించారు. పెరుగుతున్న జనాభా, వినియోగదారుల అభిరుచులు, నెట్, డేటా నెట్వర్క్ విస్తరణ వంటి అంశాల కారణంగా మొబైల్, ఐటీ బిజినెస్ల జోరు పెరుగుతోందని వివరించారు. ఇక్కడ జరుగుతున్న శామ్సంగ్ సౌత్వెస్ట్ ఫోరమ్ 2014లో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆయన గెలాక్సీ నోట్ 3 నియో స్మార్ట్ఫోన్ను, రెండు ట్యాబ్లెట్లు- గెలాక్సీ ట్యాబ్ 3 నియో, నోట్ ప్రోలను ఆవిష్కరించారు.
వీటితో పాటు డిజిటల్ ఇమేజింగ్ కేటగిరీలో రెండు కొత్త ఉత్పత్తులు-ఎన్ఎక్స్30 (20.3 మెగా పిక్సెల్), గెలాక్సీ కెమెరా2(16.3 మెగా పిక్సెల్)లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. కర్వ్ ఆల్ట్రా హై డెఫినేషన్(యూహెచ్డీ) టీవీని కూడా డిస్ప్లే చేసింది. ఈ టీవీ వచ్చే నెలలో అందుబాటులోకి రావచ్చు. దీంతో పాటు గెలాక్సీ గ్రాండ్ నియో స్మార్ట్ఫోన్ను, కస్టమైజ్డ్ వాషింగ్ మెషీన్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీదే అగ్రస్థానమని సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ రివ్యూ వెల్లడించింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి భారత్లో 1.11 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని ఈ రివ్యూ పేర్కొంది.