శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్
సాక్షి, న్యూఢిల్లీ : శాంసంగ్ స్మార్ట్ టీవీ వినియోగదారులు వచ్చే డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ సినిమాలను, ఇతర కార్యక్రమాలను చూడడం కుదరదు. సాంకేతిక పరిమితుల వల్ల ముఖ్యంగా పాత మోడళ్లలో తమ ప్రసారాలను చూడలేరని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం పేర్కొంది. రానివారు తమ కార్యక్రమాలను చూడాలంటే సరైన సెటాప్ బాక్స్‌ను అమర్చుకోవాలని సూచించింది. అయితే ఏయే మోడళ్లలో తమ కార్యక్రమాలు రావో నెట్‌ఫ్లిక్స్ వెళ్లడించలేదు.
ఆపిల్ టీవీ, క్రోమ్‌క్యాస్ట్, గేమ్ కన్సోల్స్తోపాటు మరికొన్ని ఇతర సెటాప్ బాక్సులను ఉపయోగించి తమ కార్యక్రమాలను చూడవచ్చని తెలిపింది. తమ పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల తక్కువ సంఖ్యలోని వినియోగదారులపైనే ప్రభావం ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఇంకా శాంసంగ్ టీవీల యాజమాన్యం స్పందించాల్సి ఉంది.