ఇసుక అక్రమ రవాణాపై కొరడా
రాజీవ్ రహదారిపై తనిఖీలు ముమ్మరంపలువురిపై కేసులు నమోదు
గజ్వేల్/వర్గల్: కరీంనగర్ నుంచి మెదక్ జిల్లా మీదుగా రాజీవ్ రహదారిపై ఓవర్‌లోడ్‌తో, వేబిల్లుల్లేకుండా సాగిస్తున్న ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝలిపించారు. ‘రహదారే అడ్డా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తనిఖీలను ముమ్మరం చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు 170 కిలోమీటర్ల పొడవునా నిఘా ఉంచి ఓవర్‌లోడు, వేబిల్లులతో ప్రమేయం లేకుండా వస్తున్న ఇసుక లారీలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
మూడు రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. తాజాగా శనివారం కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలను వర్గల్ మండలం గౌరారం పోలీసులు పట్టుకున్నారు. సదరు లారీల కాగితాలను పరిశీలించగా వేబిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఆ లారీల డ్రైవర్లు షేక్ ఎజాజ్, రాంజీ, లింగారెడ్డి, ఓనర్లు రంగారెడ్డి, లింగం, మహ్మద్ ఇఫ్తకార్ అహ్మద్‌లపై గనులు, భూగర్భ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇసుక లారీలను సీజ్ చేసి కోర్టులో అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.