ఈ దీపావళి జవాన్లకు అంకితం!
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సైనికులు సరిహద్దుల్లో మనకు రక్షణ అందిస్తుండటం వల్లే మనం ఈరోజు ప్రశాంతంగా దీపావళి పండుగ జరుపుకొంటున్నామని, ఈ దీవాళి పండుగను జవానులకు అంకితం చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. సందేశ్ టు సోల్జర్స్ (#Sandesh2Soldiers) హ్యాష్‌ట్యాగ్ ద్వారా దేశ ప్రజలు లక్షలాది సందేశాలను సైనికులకు అందజేశారని, వారి పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారని చెప్పారు.
గత కొన్నాళ్లుగా మన జవాన్లు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, వారి పేరు మీదుగా ఈ దీవాలీ పండుగ జరుపుకోవాలని కోరారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని రేపు జరుపుకోబోతున్నామని, అదేవిధంగా ఇందిరాగాంధీని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజల ఐక్యత కోసం సర్దార్ పటేల్ పోరాడారని, తపించారని గుర్తుచేశారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ఐక్యత కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. దీపావళి పండుగను ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారని, ఈ పండుగ ప్రజలందరినీ ఒకచోటకు చేరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.