మేయర్ కు గన్ గురిపెట్టి...
శాన్ఫోర్డ్: నగర మేయర్నే బెదిరించి కారు ఎత్తుకు పోయారు దుండగులు. అమెరికాలోని శాన్ఫోర్డ్ నగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున తన ఇంటి ముందు నిలుచున్న శాన్ఫోర్డ్ నగర్ మేయర్ జెఫ్ ట్రిప్లెట్ వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ఇద్దరు తుపాకీని మేయర్ కు గురిపెట్టి బెదిరించారు. మరొకడు కారు తాళాలు తీసుకున్నాడు. తర్వాత ముగ్గురు కలిసి మెర్సిడెజ్ బెంజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన గురించి జెఫ్ ట్రిప్లెట్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులు జెర్మైన్ జాక్వెస్(18)తో పాటు 17 ఏళ్ల వయసున్న మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి ప్రథమ పౌరుడినైన తన కారునే దొంగిలించడం పట్ల జెఫ్ ట్రిప్లెట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు.