డాక్టర్ నిర్లక్ష్యానికి రూ.3 లక్షల జరిమానా!
మెదక్ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు
సంగారెడ్డి క్రైం: రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేసిన డాక్టర్ తీరును తప్పుపడుతూ బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని వినియోగదారుల ఫోరం చైర్మన్ పాటిల్ విఠల్రావు ఆదేశించారు. ఈ వివరాలను సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అందోల్ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన చాకలి కమలమ్మ 2011 నవంబర్ 14వ తేదీన ఇంట్లో జారిపడగా కుడి కాలు విరిగింది. దీంతో అదేరోజు చికిత్స నిమిత్తం గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ ఆనంద్నాయక్ ఆధ్వర్యంలో కమలమ్మకు ఆపరేషన్ చేసి కాలులో రాడ్ వేశారు. కొన్ని రోజుల తర్వాత కాలు నొప్పి రావడంతో ఆస్పత్రికి రాగా 2012 ఫిబ్రవరి 17వ తేదీన మళ్లీ ఆపరేషన్ చేశారు.
ఈ క్రమంలో కమలమ్మ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని, అనేక ఇబ్బందులు పడాల్సివచ్చిందని పేర్కొంటూ కమలమ్మ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫోరం కమలమ్మకు రూ.3 లక్షల పరిహారం, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది.