చరిత్ర సృష్టించిన దేశ్ముఖ్
ముంబై: మహారాష్ట్రలో అత్యధికాలం ఎమ్మెల్యేగా ఉన్న పీసెంట్స్ అండ్ వర్కర్ పార్టీ(పీడబ్ల్యూపీ) ఎమ్మెల్యే గణపతిరావ్ దేశ్ముఖ్(88) చరిత్ర సృష్టించారు. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. 11సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సోలాపూర్ జిల్లాలోని సంగోలా స్థానం నుంచి ఆయన గెలుపొందారు. శివసేన అభ్యర్థి సాహాజిబాపు పటేల్ ను 25,224 ఓట్ల తేడాతో ఓడించారు. గణపతిరావ్ కు 94,374 ఓట్లు, సాహాజిబాపుకు 69,150 ఓట్లు వచ్చాయి.
సంగోలా నియోజకవర్గం నుంచి 54 ఏళ్లుగా దేశ్ముఖ్ ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం. తాజా విజయంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కరుణానిధి పది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.