‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’లల్లినవాడు
ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆం ధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పం తులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుం దరాచారి. తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది. ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.
ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా 10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. మదనపల్లె బెసెంట్ థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చదువు పూర్త య్యాక తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆం ధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మం చి గుర్తింపు పొందాయి. తర్వాత 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు. తర్వా త జూనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా లభించిన పదవిని సైతం విద్యాశాఖ డెరైక్టర్ చేతి సంచినిచ్చి అవమానించినందుకు నిరసనగా వదిలే సుకున్నారు. తన పన్నెండో ఏటనే తెలుగులో కవి త్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచ నలు చేశారు.
ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు జాతికి రాష్ట్రగీతమైం ది. 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహా సభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.
మరపురాని ఘటన: హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవ రు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్ట లతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్క డున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపా యల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.
సుందరాచారి చివరిరోజులు చాలా దుర్భ రంగా గడిపారు. తిరుపతి వీధుల్లో బికారిగా తిరు గుతూ జీవించారు. చివరి దశలో తన శిష్యుడు మన్న వ భాస్కరనాయుడు ఇంట్లో ఉండేవారు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస వదిలారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజలు పాడుకుంటున్నంత కాలం ఆయన ఏనాటికైనా తెలు గువారికి చిరస్మరణీయుడే.
(నేడు శంకరంబాడి సుందరాచారి 38వ వర్థంతి)
సి. శివారెడ్డి, సహాయ పరిశోధకులు,
సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, కడప,
మొబైల్: 9440859872