దేశ రాజధాని ‘హస్త’గతం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎనిమిదవ లోక్‌సభ ఎన్నికలు ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగాయి. దేశమంతటా వెల్లువెత్తిన సానుభూతి పవనాలతో కాంగ్రెస్ భారీ మెజారిటీతో నెగ్గింది. ఇందిరాగాంధీ కుటుంబం దేశానికి అందించిన సేవలను చాటిచెబుతూ , రాజీవ్ గాంధీని సంస్కరణాభిలాషిగా సాగించిన ప్రచారం ప్రభావం ఢిల్లీలో కూడా కనిపించింది. దాంతో ఏడు స్థానాలూ కాంగ్రెస్ కైవశం చేసుకుంది.
కేసీ పంత్ న్యూఢిల్లీలో కన్వర్లాల్ గుప్తాను ఓడించారు. చాందినీచౌక్‌లో జైప్రకాశ్ అగర్వాల్ జనతా పార్టీ నేత సికిందర్ భఖ్త్పై గెలిచారు. హెచ్‌కెఎల్ భగత్ ఈస్ట్ ఢిల్లీలో కిషోరీలాల్ను పరాజయం పాలుచేశారు. కరోల్‌భాగ్‌లో సుందర్ వతి నావల్ ప్రభాకర్, ఔటర్ ఢిల్లీలో భరత్ సింగ్ గెలిచారు. జగదీశ్ టైట్లర్ సదర్‌లో మదన్‌లాల్ ఖురానాను, లలిత్ మాకెన్ సౌత్ ఢిల్లీలో విజయ్‌కుమార్ మల్హోత్రాను ఓడించారు.
ఇందిరాగాంధీ మరణానంతరం రాజధానిలో సిక్కులపై జరిగిన అకృత్యాల ప్రభావం వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలపై కనిపించనప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ఢిల్లీ రాజకీయాలపై కనిపించసాగింది. సిక్కు అల్లర్లలో హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్న సౌత్ ఢిల్లీ ఎంపీ లలిత్ మాకెన్ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. కీర్తినగర్‌లోని తన నివాసం ముందున్న రోడ్డుకు అవలివైపున పార్క్ చే సిన కారు వైపునకు నడిచివెళ్తుండగా ఉగ్రవాదులు లలిత్ మాకెన్‌ను , ఆయన భార్య గీతాంజలిపై హత్యచేశారు.
లలిత్ మాకెన్ మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ అల్లుడు. ప్రస్తుత న్యూఢిల్లీ ఎంపీ అజయ్ మాకెన్ ఆయన సోదరుని కుమారుడు. లలిత్ మాకెన్ మరణంతో సౌత్ ఢిల్లీ నియోజకవర్గానికి 1985లో ఉప ఎన్నిక జరిగింది. దానిలో కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ బీజేపీకి చెందిన విజయ్ కుమార్ మల్హోత్రాను ఓడించారు.
1984 ఎన్నికల నాటికి ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 35 లక్షలయ్యింది.వారిలో 20 లక్షల మంది పురుషులు కాగా 15 లక్షల మంది మహిళలు. ఈ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించకున్నారు. వారిలో 9 మంది మహిళలు. ఈ 9 మందిలో కరోల్ బాగ్ నుంచి పోటీచేసిన సుందరవతి నావల్ ప్రభాకర్ మాత్రమే విజయం సాధించారు.