ఊరు పిలిచింది
సిటీబ్యూరో: సంక్రాంతి రద్దీ పోటెత్తింది. బస్సైనా..రైలైనా.. సీటున్నా.. లేకున్నా.. రిజర్వేషన్ ఉన్నా..జనరల్ బోగీ అయినా సరే తప్పదు అన్నట్లుగా నగరం నుంచి లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. బుధవారం నుంచి పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున బయలుదేరారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు, ఎల్బీనగర్, ఉప్పల్, మెహిదీపట్నం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని కూడళ్లు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి.
సాధారణ రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3500 బస్సులకు తోడు మరో 500 బస్సులను బుధవారం అదనంగా ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయలుదేరే వందకు పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు లభించని వాళ్లు జనరల్ బోగీలను ఆశ్రయించారు. యథావిధిగా చార్జీల దోపిడీ కొనసాగింది.