గిరుల సిరులు
=ఆదివాసీ సంస్కృతిని చాటిన ఉత్సవ్
=పరిరక్షణకు మంత్రి బాలరాజు పిలుపు
=పర్యాటక సర్క్యూట్‌గా అరకులోయ ప్రాంతం
=అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు
అరకులోయ/అరకురూరల్: మన్యంలోని ఎత్తయిన కొండలు, లోయలు, జలపాతాలు, ఇతర ప్రకృతి సంపదను కాపాడుకుంటూనే సంప్రదాయలను పరిరక్షించుకోవాలని రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి. బాలరాజు పేర్కొన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవ్‌ను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు.
కార్యక్రమంలో బాల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని విభిన్న గిరిజన జాతులను ఒకే విదికపైకి తెచ్చి పరిచయం చేస్తున్నామన్నారు. పర్యాటకులను ఉత్సవ్ అలరిస్తుందన్నారు. థింసా నృత్యం గిరిజనులకు వరమన్నారు. తక్కువ ఖర్చుతో ఏటా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని సదుపాయలతో పాటు,భద్రత వాతావరణం కల్పిస్తేనే ఈ ప్రాంతానికి మంచిపేరు వస్తుందన్నారు.
సీలేరు,చింతపల్లి,దారకొండ,పాడేరు,అరకు,అనంతగిరి,లంబసింగి ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అరకులోయకు ప్రత్యేకంగా అద్దాల రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర ైరె ల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించినట్లు మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఉత్సవాలనాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ మాట్లాడుతూ అన్ని గిరిజన జాతుల సంస్కృతులకు ఈ ఉత్సవ్ అద్దం పడుతుందన్నారు.
గిరిజన కళలు, సంప్రదాయాలు, ఆహారధాన్యాలు దృశ్య మాలికగా ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని కళాబృందాలను ఇక్కడకు తీసుకువచ్చారు. అరకులోయ ప్రధాన రహదారితోపాటు ఉత్సవ్ ప్రాంగణం కళాబృందాల ప్రదర్శనలతో నిండిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అరకులోయ సీఐ మురళీరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు కె. కుమారస్వామి, రామకృష్ణలు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారితోపాటు అన్ని కూడళ్లను నిఘా బృందాలు నిశితంగా పరిశీలించాయి. ప్రాంగణంలో పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
స్థానికుల భాగస్వామ్యం ఏదీ : ఎమ్మెల్యేసోమ
అరకు గిరిజన ఉత్సవ్‌లో స్థానిక గిరిజన ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే సోమ విచారం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్‌ను ఆహ్వానించి ఈ సభకు అధ్యక్షునిగా చేసి ఉంటే బాగుండేదన్నారు. వేదికపై అధికారులు మినహా స్థానిక ప్రజా ప్రతినిధులు లేక పోవడం బాధాకరమన్నారు. వ్యాపారులు, గిరిజన సంఘాలను ఆహ్వానించి ఉంటే మరింత విజయవంతంగా జరిగేదన్నారు.
మంత్రికి ఘనస్వాగతం
ఉత్సవ్ ప్రారంభోత్సవానికి అరకులోయ వచ్చిన మంత్రి బాలరాజుకు పర్యాటకశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అరకులోయ ముఖద్వారం నుంచి వివిధ కళాబృందాలతో పాటు థింసా నృత్యాలతో స్వాగతం పలికి వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు.
సుమారు కిలోమీటరు దూరం కాలి నడకన కళాకారులతో కలిసి వేదిక వరకు మంత్రి నడుచుకుని వచ్చారు. ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, సీడ్ ఫెస్టివల్‌ను తిలకించారు. కార్యక్రమంలో పాడేరు ఆర్డీవో గణపతిరావు, డీడీ మల్లికార్జునరెడ్డి, పర్యాటక శాఖ జీఎం భీమశంకర్, పర్యాటకశాఖ అధికారిణి అనిత, కో-ఆర్డినేటర్ మురళీ పాల్గొన్నారు.