ఓ చిన్నారి పెళ్లికూతురు పోరాటం
జోధ్పూర్: అప్పుడు ఆ పాప వయసు 11 నెలలు. పేరు శాంతాదేవి మేఘ్వాల్. ఊరు.. రాజస్థాన్లోని లూనీ తాలూకా రోహిచాన్ ఖుర్ద్ గ్రామం. ఏడాది కూడా నిండని ఆ పసిపాపకు పెళ్లి చేశారు. ఆమె పెరిగింది. మేజర్ అయింది. కాలేజీలో చదువుతోంది. తనకు 11 నెలల వయసులోనే పెళ్లి చేశారని మూడేళ్ల కిందట తెలిసింది. ఆ పెళ్లిని రద్దు చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. ‘అత్తింటి వారు’ ఒప్పుకోలేదు. రకరకాలుగా బెదిరించారు. ఆమె పట్టువీడలేదు.
దీంతో అత్తింటివారు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టారు. పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఆ బాలికావధువుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. ఆమె కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించింది. శాంతాదేవి బెదిరిపోలేదు. న్యాయ పోరాటానికి సన్నద్ధమైంది. సహాయం కోసం సారథి ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. ‘అత్తింటి వారికి’ కౌన్సిలింగ్ ఇప్పించేందుకూ ప్రయత్నిస్తోంది. తన కుమార్తె చదువుకోవాలని.. సమాజంలో దుష్ట సంప్రదాయాలను తిరస్కరిస్తూ ఒక మార్గదర్శిగా నిలవాలని శాంతాదేవి తండ్రి పద్మారామ్ ఇప్పుడు కోరుకుంటున్నారు.