‘జాతి నిర్మాణంలో యువత పాల్గొనాలి’
హైదరాబాద్: నవ భారత నిర్మాణంలో యువతరం కీలక భాగస్వాములు కావాలని అప్పుడే సరైన ఫలితాలు లభిస్తాయని ప్రధానమంత్రి సలహా మండలి (నేషనల్ కౌన్సిల్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్) సభ్యులు, టీసీఎస్ వైస్ చైర్మన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) పాలకమండలి చైర్మన్ ఎస్. రామదొరై పేర్కొన్నారు. ఆయన మంగళవారం జరిగిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ హైదరాబాద్ క్యాంపస్ తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సవాళ్లను పరిష్కరించడానికి సమర్థులైన యువతను తీర్చిదిద్దడంలో టిస్ ముందంజలో ఉండటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా 120 మందికి ఎస్. రామదొరై పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో టిస్ డెరైక్టర్ ఎస్. పరశురామన్, టిస్ హైదరాబాద్ క్యాంపస్ డిప్యూటీ డెరైక్టర్ ప్రొఫెసర్ లక్ష్మి లింగ్, మెగసేసే అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు.