దసరా వేళ దారుణాలు
పండుగ పూట సారవకోట మండలం విషాద ఘటనలకు నెలవైంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల బలవన్మరణాలు దసరా సరదాను అర్థంతరంగా తుంచేశాయి. శనివారం వెలుగు రేఖలు విచ్చుకుంటూనే.. తమతోపాటు నాలుగు మృతదేహాలను వెలుగులోకి తెచ్చాయి. బావి, పొలంలో తేలిన విగత జీవుల శరీరాలను చూసి గొల్లపేట, బుడితి గ్రామాలు ఘొల్లుమన్నాయి.గొల్లపేట గ్రామానికి చెందిన శ్రావణి, ఆమె కుమార్తె శిరీష, కుమారుడు రోహిత్ గురువారం సాయంత్రం నుంచీ కనిపించకుండాపోయారు. శ్రావణి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే శనివారం తెల్లవారుజామున ఆ ముగ్గురు తమ ఇంటికి సమీపంలోని బావిలోనే విగతజీవులుగా తేలుతూ కనిపించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అల్లుడు పాపారావు, అతని కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శ్రావణి తండ్రి ఆరోపించారు.
కామినాయుడుపేటకు చెందిన విజయమ్మ కన్నవారింటికి వెళుతూ మార్గమధ్యంలో లైంగిక దాడికి, హత్యకు గురైంది. శనివారం ఉదయం పొలాల్లో ఆమె మృతదే హం కనిపించింది. సంఘటన స్థలంలోని ఆనవాళ్ల ఆధారంగా సామూహిక అత్యాచారం జరిపిన అనంతరం హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.గొల్లపేట(సారవకోట రూరల్): తన కుమార్తెను మెట్టినింటిన వారే హతమార్చారని మృతురాలి తండ్రి, బంధువులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తుండేవాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం... కేళవలస పంచాయతీ గొల్లపేటలో శనివారం అనామానాస్పదంగా తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అల ముకున్నాయి. తల్లీ, ఇద్దరు పిల్లల మృతదేహాలు బావి లో తేలి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఊళ్ల శ్రావణి(26), కుమార్తె శిరీష, కుమారుడు రోహిత్(5) శనివారం మృతి చెంది పాడుబడిన బావిలో తేలారు.
2006లో వివాహం
కోటబొమ్మాళి మండలం చిట్టేవలస గ్రామానికి చెందిన శ్రావణికి సారవకోట మండలం కేళవలస పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన ఊళ్ల పాపారావుతో 2006లో వివాహమైంది. ఈ నెల 2న భార్యాభర్తలు, పిల్లలు దసరాకు చిట్టేవలస వెళ్లి వచ్చారు. అదే రోజు సాయంత్రం నుంచి శ్రావణి, శిరీష, రోహిత్‌లు కన్పించకుండా పోయారు. దీంతో భర్త పాపారావు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, స్నేహితులను ఆచూకీ కోసం వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో శుక్రవారం శ్రావణి తండ్రి దేవర మల్లేష్ సారవకోట పోలీసుస్టేషన్లో తన పిల్లలు, మనువలు కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు. శనివారం వారింటికి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో మృత దేహాలు తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, కొత్తూరు సీఐ ఇలియాబాబు, స్థానిక ఎస్ఐ గణేష్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శాంతో తెలిపారు.
భర్త, అత్తమామలు, ఆడపడుచే హతమార్చారు
తమ కుమార్తె శ్రావణిని భర్త పాపారావు, మామ దాలయ్య, అత్త అప్పలనరసమ్మ, ఆడపడుచు నమ్మి బాలమ్మలు హతమార్చారని శ్రావణి తండ్రి దేవర మల్లేష్ ఫిర్యాదు చేశారు. వివాహమైనప్పుడు రూ.80 వేల కట్నం, 5 తులాల బంగారం ఇచ్చామని, అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని దీనిపై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో సంప్రదింపులు జరిగాయన్నారు. ఇటీవల తన ఇంటికొచ్చినప్పుడు కూడా గొడవ పడి తమ కుమార్తెను కొట్టడం జరిగిందని ఆరోపించాడు. అదనపు కట్నం కోసం తన కుమార్తెను మనువలను హతమార్చి బావిలో తోసేశారన్నారు. కుమార్తె, ఆమె పిల్లలు కన్పించడం లేదని గ్రామానికి వెళ్తే తమపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.
కన్పించడం లేదని కేసు నమోదు
తమ కుమార్తె శ్రావణి, మనుమలు శిరీష, రోహిత్ కన్పించడం లేదని కోటబొమ్మాళి మండలం చిట్టేవలస గ్రామానికి చెందిన దేవర మల్లేష్ శుక్రవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై హెచ్‌సీ రాజారావు కేసు నమోదు చేశారు. అయితే శనివారం నాటికి ఈ మూడు మృత దేహాలు గొల్లపేటలోని పాడుబడిన బావిలో తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.