తిరుత్తణి స్వామివారికి టీటీడీ సారె
– ఈవో, తిరుమల జేఈవో దంపతులచే సమర్పణ
తిరుపతి అర్బన్: ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని తమిళనాడులోని తిరుత్తణి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వళ్లీ–దేవసేన సమేత సుబ్రమణ్య స్వామివారికి టీటీడీ తరఫున సారె సమర్పించారు. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు గురువారం తిరుపతి నుంచి బయల్దేరి పట్టు వస్త్రాలు, సారెతో తిరుత్తణికి చేరుకున్నారు. తిరుత్తణి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ సుబ్రమణ్య స్వామివారికి సమర్పించారు. తిరుత్తణి ఆలయ అర్చకులు టీటీడీ పట్టు వస్త్రాలు, సారెను స్వామివార్లకు అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ ఆడికృత్తిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ సుబ్రమణ్య స్వామివారి ఆలయానికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తమిళనాడుకు చెందిన భక్తులే కాకుండా, సరిహద్దు జిల్లాల భక్తులు కూడా కావడులతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారని పేర్కొన్నారు.