మా ఇద్దరి తీరు వేరు
‘ఖూబ్సూరత్’ హీరో ఫవద్ ఖాన్ అంటే తనకు అభిమానం ఉన్నా పనితీరులో తమ ఇద్దరి మధ్య అంత సత్సంబంధాలు లేవని ‘హమ్‌సఫర్’ డెరైక్టర్ సర్మద్ ఖూసత్ అన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో సూపర్‌హిట్ అయిన టీవీ షో ‘హమ్‌సఫర్’కు సర్మద్ దర్మకత్వం వహించగా, ఫవద్ హీరోగా నటించాడు. ‘ఫవద్ మంచి నటుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నాకు,అతనికి పని విధానంలో చాలా తేడా ఉంది. మా ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ అంతగా కుదరలేదనే చెప్పాలి. హమ్‌సఫర్ వరకు మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానేఉన్నాయి. అయితే అతడితో మళ్లీ,మళ్లీ పనిచేయాలనే ఆలోచన నాకు లేదు.. అతడు నా విష్ లిస్ట్‌లో లేడు..’ అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. ‘నాకు ఫవద్ నటనంటే చాలా ఇష్టం.. అయితే మా మధ్య అంతగా విభేదాలు లేవు.. భవిష్యత్తులో అతడితో పనిచేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నేను, ఫవద్, మహిరా కలిసి మళ్లీ ఒక ప్రాజెక్టు చేస్తామనే అనుకుంటున్నా..
అయితే అతడితో తప్పనిసరిగా చేయాలి అనే భావన నాలో లేదు. నా అభిమాన నటుల్లో అతడు లేడు..’ అని చెప్పాడు. భారత ప్రేక్షకులు ఫవద్ను ఆదరించడం తనకు చాలా ఆనందంగా ఉందని సర్మద్ పేర్కొన్నాడు. ‘భారత ప్రేక్షకులు ప్రతిభను గుర్తిస్తారని మరోసారి రుజువైంది.. ఇటువంటి ఘటనల వల్ల రెండు దేశాల మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని భావిస్తున్నా..’ అని పాకిస్థానీ డెరైక్టర్, నటుడు అయిన సర్మద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థానీ రచయిత రచించిన ‘ఫర్హత్ ఇష్థియఖ్స్’ అనే నవల ఆధారంగా ఈ సీరియల్‌ను నిర్మించారు. ఇందులో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని రచయిత చక్కగా విశదపరిచాడని, ఇటువంటి డ్రామా ఉన్న కథాంశాలను భారత ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సర్మద్ ధీమా వ్యక్తం చేశాడు.