సాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు : రైతులకు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని సంగం ఆనకట్ట నుంచి కనుపూరు కాలువకు సాగునీటి విడుదలను ఎమ్మెల్యే శనివారం రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు సాగునీటి పంపిణీపై అవగాహన లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుని వ్యవసాయ పనుల్లో మునిగి ఉన్నా అధికారులు ఇప్పటి వరకు సాగునీటిపై స్పష్టత లేకుండా ఉండడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులను వెచ్చించకపోవడం దారుణమన్నారు.
సాగునీటి కాలువల్లో నాచు, గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి పారుదల సమస్యలు ఉన్నా కాలువలకు నీటిని విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. కనుపూరు కాలువకు సాగునీరు సక్రమంగా అందాలంటే సంగం ఆనకట్టపై ఇసుక బస్తాలు వేయాలని అధికారులకు ఎన్ని పర్యాయాలు చెప్పినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇందువల్ల కాలువ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేపరిస్థితి లేదన్నారు. అధికారుల తప్పిదం వల్ల సాగునీరు అందకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో జిల్లాలో కాలువల ఆధునీకరణకు మంజూరు చేసిన ప్యాకేజీలను ఇప్పటి వరకు అధికారులు పూర్తిచేసింది లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సాగుచేస్తున్న పంటలు ఎండకుండా ఉండాలంటే ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు పూర్తిసహకారం అందివ్వాలన్నారు. పంటలు రైతుల ఇళ్లకు చేరేవరకు మూడు నెలల పాటు తాను పర్యటిస్తుంటానన్నారు. ఎక్కడ సాగునీటి ఇబ్బందులు ఏర్పడినా కాలువ వెంబడి తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు.
అధికారులు సమన్వయంతో పనిచేస్తే రైతుల పంటలు పండుతాయన్నారు. సాగునీటిని రైతులు సైతం వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకుని పంట లు పండించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి భాస్కర్‌గౌడ్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటశేషయ్య, విరువూరు సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీ సీ సభ్యుడు కొల్లి రాజగోపాల్‌రెడ్డి, సూరాయపాళెం, తాటిపర్తి మాజీ సర్పంచులు ఎం.మల్లారెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, వెంకురెడ్డి, జి.శ్రీనివాసులు, ఏడెం శివకుమార్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు శివకుమార్‌రెడ్డి, రమేష్, విరువూరు, సూరాయపాళెం, మహ్మదాపురం రైతులు ఉన్నారు.