గంటా కొత్త పాట!
విలీన రాజకీయం
శాటిలైట్ మున్సిపాలిటీగా మారుస్తానంటూ హామీ
నాడు విలీనానికి సహకరించి..నేడు మాట మార్చి..
భీమిలి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వరం మారింది. ఇప్పటి వరకు ఎన్నికలకో నియోజక వర్గం, పార్టీలు మార్చే గంటా ఇప్పుడు హామీల్లో కూడా అదే బాటపడుతున్నారు. జీవీఎంసీలో భీమునిపట్నం మున్సిపాలిటీ విలీనానికి ప్రధాన కారకుడైన గంటా ఇప్పుడు మాట మార్చి.. మళ్లీ భీమిలిని మున్సిపాలిటీగా మారుస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
కుమ్మక్కు నిర్ణయాలు!
జీవీఎంసీలో విలీనానికి ఆరంభం నుం చీ భీమి లి ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. స్థానిక పాలన ముగిశాక అధికారులపై స్థానిక నాయకుల ఒత్తిడి పెరిగింది. అప్పటి వరకు శాటిలైట్ నగరంగా తీర్చిదిద్దుతానంటూ హామీలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కూడా మాట మార్చారు. దీని వెనుక మాజీ మంత్రి గంటా హస్తముందని స్థానికుల నమ్మకం. అనకాపల్లి, భీమిలి విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే జీవీఎంసీలో 210, అనకాపల్లిలో కేవలం 20 అభిప్రాయాలు మాత్రమే వచ్చాయి.
భీమిలి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా 258 లేఖలొచ్చాయి. ఇది తెలుసుకున్న భీమిలి నేతలు అప్రమత్తమయ్యారు. దీనికి జీవీఎంసీ అధికార యంత్రాంగం కూడా సహకరించింది. భీమిలి విలీనానికి అనుకూలంగా ఉన్నట్టు ఒకే విషయాన్ని వేల సంఖ్యలో ముద్రించి.. పేపర్ కింద ఆ నేతల అనుచరులతో సంతకాలు చేయించి జీవీఎంసీకి ఇచ్చేశారు.
అప్పటి వరకు వంద కూడా రాని అభిప్రాయాలు ఏకంగా 3119కే చేరుకున్నాయంటే.. దీని వెనుక గంటా, అవంతిల హస్తం ఏపాటిదో స్థానికులు గుర్తించారు. అందుకే వీరి తీరుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దీంతో పంచాయతీల విలీనం వెనక్కి జరిగి, వాటికి ఎన్నికలు కూడా నిర్వహించేశారు.
వ్యతిరేకత తెలుసుకుని..!
భీమిలి విలీన వ్యవహారంలో తనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలున్నాయన్న విషయాన్ని గుర్తించే ఇప్పుడు గంటా స్వరం మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల్ని శాంతింపజేసేందుకు మళ్లీ మున్సిపాలిటీగా చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి, భీమిలికి మధ్యనున్న పంచాయతీల్ని మినహాయించడంతో రెండు ప్రాంతాలకూ లింకు తెగింది. దీంతో భీమిలి విలీనాన్ని ఉపసంహరించుకునే దిశగా ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ఇప్పటికే దీనిపై ఫైల్ కూడా సిద్ధం చేసింది. వీలైనంత వేగంగా భీమిలిని ఉపసంహరించి, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించింది.
కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికార వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న గంటా ఇప్పుడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే భీమిలిని తిరిగి మున్సిపాలిటీ చేస్తానంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో మాత్రం భీమిలి విలీన ప్రహసనం గంటా కొంప ముంచడం ఖాయమని స్థానికులు జోస్యం చెప్తున్నారు.