షార్ నుంచి మరో నాలుగు ప్రయోగాలు
షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ చివరి నాటికి మరో నాలుగు ప్రయోగాలు చేయనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న పీఎస్ఎల్వీ సీ–39 శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్– 1హెచ్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపుతున్నట్లు తెలిపారు. 2013లో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్– 1 ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పనిచేయట్లేదని, దాని స్థానంలో ఐఆర్ఎన్ఎస్ఎస్– 1హెచ్ ఉపగ్రహాన్ని రోదíసీలోకి పంపిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం రెండు పీఎస్ఎల్వీ రాకెట్లు, ఒక జీఎస్ఎల్వీ మార్క్– 2 ప్రయోగాలు ఉంటాయని వివరించారు. 2018 ప్రథమార్ధంలో చంద్రయాన్–2 ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ నాటికి రెండో రాకెట్ అనుసంధాన భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. షార్కు మరో రెండు కొత్త ప్రాజెక్టులు రానున్నట్లు కున్హికృష్ణన్ తెలిపారు. అలాగే సుమారు రూ. 630 కోట్లతో నిర్మిస్తున్న వరల్డ్ క్లాస్ సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని తెలిపారు. ఏటా అక్టోబర్ 4 నుంచి 10 వరకు నిర్వహించే అంతరిక్ష వారోత్సవాలను ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట గ్రూప్ డైరెక్టర్ పి.గోపీకృష్ణ, పీఆర్వో విశ్వనాథశర్మ ఉన్నారు.