సత్తాచాటిన భూపాలపల్లి యువతేజం
సూపర్ స్పెషాలిటీ కిడ్నీ సర్జరీ ఫలితాల్లో మెుదటి ర్యాంక్ సాధించిన కిరణ్భూపాలపల్లి, గణపురం: సూపర్ స్పెషాలిటీ కిడ్నీ సర్జరీ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్షలో జిల్లా యువతేజం ఉస్కె కిరణ్ మెుదటి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. శనివారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఈ మేరకు తనకు ర్యాంక్ వచ్చిందని ఆయన తెలిపారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని మహబూబ్‌పల్లి గ్రామానికి చెందిన ఉస్కె సరోజన, లింగయ్య కుమారుడు కిరణ్. ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో ఎంబీబీఎస్ , ఎంఎస్ జనరల్ సర్జరీ కోర్సులు పూర్తి చేశారు. అనంతరం తన లక్ష్యమైన కిడ్నీ సర్జరీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయగా, అందులో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు కిరణ్‌ను అభినందించారు.
అమ్మా,నాన్నలే స్ఫూర్తి
‘మా అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. అయినా వారికి చదువు విలువ ఏంటో తెలుసు. అందుకే నన్ను బాగా చదివించారు. వారే నాకు స్ఫూర్తిప్రదాతలు. వారి పేరు నిలబెట్టాలనే సంకల్పంతో చదివాను. మంచి ర్యాంక్ వచ్చింది. అమ్మానాన్న పేరిట ఫౌండేషన్ ఏర్పాటుచేసి భూపాలపల్లి లాంటి మారుమూల గ్రామాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తా. కిడ్నీ సర్జరీ విభాగంలో ఇప్పటిదాకా హైదరాబాద్‌కే పరిమితమైన రోబోటిక్ సర్జరీని వరంగల్‌లోని వైద్యశాలలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది’ – ఉస్కె కిరణ్