ముగిసిన భారత్ పోరు
సుదిర్మన్ కప్ క్వార్టర్స్‌లో 0–3తో చైనా చేతిలో ఓటమి
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): రెండోసారి క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు చేరిన భారత బ్యాడ్మింటన్ జట్టు ఈసారీ ఆ అడ్డంకిని దాటలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో శుక్రవారం జరిగిన సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 0–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 21–16, 13–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట లూ కాయ్–హువాంగ్ యాకియోంగ్ చేతిలో ఓడిపోయింది.
రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 17–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ –చిరాగ్ శెట్టి జోడీ 9–21, 11–21తో ఫు హైఫెంగ్–జాంగ్ నాన్ ద్వయం చేతిలో పరా జయం పాలైంది. దాంతో చైనా 3–0తో విజయాన్ని ఖాయం చేసుకొని సెమీఫైనల్‌కు అర్హత సాధిం చింది.
ఫలితం తేలిపోవడంతో మహిళల సింగిల్స్ (సింధు), మహిళల డబుల్స్ (అశ్విని–సిక్కి రెడ్డి) మ్యాచ్‌లను నిర్వహించలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో జపాన్ 3–1తో మలేసియాను ఓడించింది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌తో కొరియా; జపాన్‌తో చైనా తలపడతాయి. 2011లో భారత జట్టు ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించి చైనా చేతిలోనే ఓడింది.