దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం
సాక్షి, చోడవరం: మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు నిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమయ్యేవారు. తన ఇంటికే కాదు స్వగ్రామమైన చోడవరం మండలం పీఎస్‌పేటకు, నియోజకవర్గానికి, జిల్లాలకు పెద్దదిక్కుగా ఉండేవారు. వయసు మీదపడుతున్పప్పటికీ ప్రజలకు చేరువగా ఉంటూ వారికి సేవ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టడం అంటే ఆయనకు నచ్చేది కాదు. ఒక మారుమూల కుగ్రామంలో పుట్టినప్పటికీ రాజకీయ పదవుల కోసం ఆయన ఏనాడూ వెంపర్లాడలేదు. పదవులన్నీ ఆయనను వెతుక్కుంటూనే వచ్చాయి. 1936లో పీఎస్‌పేటలో జన్మించిన ఆయన 1962లో మొదటి సారిగా రాజ్యాంగబద్ధమైన చోడవరం పంచాయతీ వార్డు సభ్యుడిగా ఎన్నికతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
ఆయన విద్యార్థి దశనుంచే విద్యార్థి సంఘ నేతగా తొలిదశలోనే సామాజిక అంశాలపై పోరాటాలు చేశారు. నేషనల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు జవహర్లాల్ నెహ్రూ కుటుంబం అంటే అమితమైన ప్రేమ. 1989లో మొదటి సారిగా చోడవరం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన రెండు సార్లు గెలిచి ఒక పర్యాయం ఏడాది పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో అనేక పదవులు చేపట్టిన బలిరెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ఇష్టం. నిజమైన ప్రజానాయకుడిగా రైతుల కష్టాలు తెలిసిన రైతు బాంధవుడని ప్రతీ సభలోనూ బలిరెడ్డి కొనియాడేవారు. వైఎస్‌పై ఉన్న అమితమైన ప్రేమతో ఆయన తనయుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి సేవలందిస్తున్నారు. ఆయన అకాల మృతి చోడవరం ప్రాంత ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది.
ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు
మాజీ మంత్రి, డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు (83) ప్రమాదానికి కారణమైన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎంఆర్పేట ఎస్ఐ రమేష్ తెలిపారు. వాకింగ్ నిమిత్తం బీచ్‌వైపు వెళ్తున్న సత్యారావును శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన ఉప్పాడ రాము బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
నీతి నిజాయితీలకు మారు పేరుగా..
చోడవరం నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలు ఉండగా బలిరెడ్డి బంధువర్గం ఈ నాలుగు మండలాల్లో ఎక్కువగా ఉంది. తన కూతుళ్లు ఇద్దర్నీ ఇదే నియోజకవర్గంలో పెద్ద కుటుంబాలకు చెందిన వారికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుళ్లు కూడా రాజకీయంగా రావికమతం మండలంలో గట్టి పట్టు ఉన్నావారే. పెద్దమనిషిగా, నీతికి, నిజాయితీకి మారుపేరుగా, మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. కాంగ్రెస్‌పార్టీలో ఓ వర్గం నిత్యం ఈయన వెంటనే ఉంది. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైబడి కాపు ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్‌లో పట్టున్ననాయకుడు కావడంతో జిల్లా పగ్గాలు పలుమార్లు చేపట్టి, జిల్లా వాసులందరికీ సుపరిచితుడు.
పాదయాత్రలో జగన్మోహన్రెడ్డితో బలిరెడ్డి
రాజకీయ ప్రస్థానమిలా..
► 1962లో చోడవరం పంచాయతీ వార్డు మెంబరుగా ఎన్నిక
► 1981–86 వరకు రావికమతం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.
► 1986–89వరకు డీసీసీ కార్యదర్శిగా
► 1989లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదలశాఖామంత్రిగా పనిచేశారు.
► 1999లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలవడంతోపాటు డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌పార్టీ నియమించింది.
► 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందగా, డీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలో కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేల విజయానికి కృషి చేశారు.
► 2005లో జిల్లాకేంద్రసహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
► 2007– రెండోసారి డీసీసీఅధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
► 2011లో విశిష్ట సహకార వేత్త పురష్కారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి అందుకున్నారు.
► 2012 నుంచి వైఎస్సార్ సీపీలో సీనియర్ నాయకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధికి దిక్సూచి ‘బలిరెడ్డి’
చోడవరం: నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు హయాంలోనే. 1981లో రావికమతం సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన ఆయన చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలను అనుంసధానం చేసే కార్యక్రమాలు చేపట్టారు. 1989లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బలిరెడ్డి నియోజకవర్గంలో మండలాలను అనుసంధానంచేసే గొంప, తోటకూరపాలెం, సీతయ్యపేటక రోడ్లు వేయించారు.
గౌరీపట్నం గుండెల్లో చిరస్మరణీయుడు
గౌరీపట్నం పేరు చెప్పగానే ఒకప్పుడు అందరూ అమ్మో అనే రోజులవి. పెద్దేరు నదికి అవతల ఉన్న ఈ గ్రామం వెళ్లాలంటే పెద్దప్రమాదం నుంచి బయటపడినట్టే అన్నట్టుగా ఆ రోజుల్లో ప్రజలు ఆందోళన చెందేవారు.మధ్యతరహా నీటిపారుదల శాఖామంత్రిగా పెద్దేరు నదిపై గౌరీపట్నం వంతెన నిర్మించారు. వ్యవసాయమంటే ఎంతో ఇష్టం: రాజకీయా నేతలు చాలా మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ అదే ప్రధాన వృత్తిగా పొలంలో పనిచేసే నేతలు కొందరే. బలిరెడ్డి సత్యారావు మాత్రం వ్యవసాయమంటే ఆయనకు ఎంతో ప్రాణం. ఉదయాన్ని సైకిల్‌పై తన పొలంలోకి వెళ్లి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని పొలం పనులన్నీ చూసుకొని ఇంటికి సైకిల్‌పై రావడం నిత్యకృత్యం.
బుచ్చెయ్యపేటతో విడదీయరాని బంధం
ఇటీవల పెదమదీన గ్రామంలో ధర్మశ్రీ అభినందన సభలో వేదికపై బలిరెడ్డి
బలిరెడ్డి సత్యారావు మృతితో మండల వైఎస్సార్సీపీ నేతలు శోక సముద్రంలో మునిగిపోయారు. అజాత శత్రువుగా పేరు గాంచిన బలిరెడ్డి సౌమ్యుడు అవడంతో ఆయనను ఇతర పార్టీల నేతలు గౌరవించేవారు. మండలంలోని విజయరామరాజుపేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ చైర్మన్ పదవిని అధిరోహించారు. బుచ్చెయ్యపేట మండలంలో సమితి అధ్యక్షుడిగా ఉన్న హయాంలోనే వ్యవసాయ బావులు, పెద్దేరు జలాశయ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. బుచ్చెయ్యపేట మండలానికి నా లుగు కిలోమీటర్ల దూరంలోనే బలిరెడ్డి స్వ గ్రామం పీఎస్ పేట ఉండటంతో మండల నా యకులకు అందుబాటులో ఉండేవారు.
శోకసంద్రంలో పీఎస్‌పేట
బలిరెడ్డి సత్యారావు రాజకీయ ప్రస్థానం వల్ల పీఎస్‌పేట గుర్తింపుపొందింది. చోడవరం పం చాయతీలో శివారు గ్రామాల్లో ఒకటైన పీఎస్‌పేట గ్రామం వ్యవసాయమే ప్రధానం. ఇంత చిన్న గ్రామం నుంచి రాష్ట్ర,జాతీయ స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు బలిరెడ్డి. ఆయన నిర్వహించిన పదవులు వల్ల నిత్య ప్రముఖుల తాకిడితో ఈ గ్రామం సందడిగా ఉండేది. అలాంటి పెద్దాయన అకాలంగా మృతిచెందారని తెలియడంతో పీఎస్‌పేట గ్రామ ప్రజలంతా కన్నీరుమున్నీరయ్యారు. గ్రామçస్తులు బలిరెడ్డి స్వగృహానికి చేరుకొని విలపించారు.
నేతల నివాళులు
మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ నేత బలిరెడ్డి సత్యారావు మృతికి పలువురు ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నేతలు నివాళులు అర్పించారు. రోడ్డుప్రమాదంలో గాయపడి మైక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బలిరెడ్డి మృతిచెందారు. విషయం తెలిసిన నేతలంతా ఆస్పత్రికి చేరుకున్నారు. బలిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అక్కడున్న బలిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
బలిరెడ్డి మరణం బాధించింది
బలిరెడ్డి సత్యారావు మృతి నన్ను తీవ్రంగా బాధించింది. సత్యారావు రాజకీయ రంగంలో జిల్లా ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వైఎస్సార్సీపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.
– అవంతి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి
పార్టీ కోసం కష్టపడ్డారు
వైఎస్సార్‌తో బలిరెడ్డి సన్నిహితంగా ఉండేవారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. వైఎస్సార్సీపీ కోసం ఎంతగానో కష్టపడ్డారు. బలిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
– వంశీకృష్ణశ్రీనివాస్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు
ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు
బలిరెడ్డి సత్యారావు అకాల మరణం బాధిస్తోంది. రెండు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా, డీసీసీబీ చైర్మన్‌గా జిల్లాకు ఎనలేని సేవలు అందించారు. 80 ఏళ్ల పైబడినా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
– గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే
పార్టీకి తీరని లోటు
బలిరెడ్డి సౌమ్యుడు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయనను పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. రాజకీయంగా ఎనలేని సేవలు అందించారు. పార్టీకి తీరనిలోటు.
– తిప్పలనాగిరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే
బలిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి
బలిరెడ్డి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా.
– ద్రోణంరాజు శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్
రైతు బాంధవుడు బలిరెడ్డి
మహానేత వైఎస్సార్‌కి అత్యంత ఆప్తుడు బలిరెడ్డి. రైతు బాంధవుడిగా పేరుంది. జిల్లా రాజకీయాల్లో అచ్చమైన పంచెకట్లు కనుమరుగైంది. ఆయన మరణం వైఎస్సార్సీపీకి తీరనిలోటు.
– కొయ్య ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత
మావయ్యలేని లోటు తీరనిది: ఎమ్మెల్యే ధర్మశ్రీ
నోరారా మావయ్యగా గారూ...అని పిలుచుకునే పెద్దాయన, తన రాజకీయ గురువు బలిరెడ్డి సత్యారావు మృతి తీరనదని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కన్నీటి పర్యంతమయ్యారు. నియోజకవర్గ సమస్యపై కేంద్రం అధికారులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ధర్మశ్రీ అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడారు. తనకు పెద్దదిక్కు లేకుండా అయిపోయిందని విలపించారు.