బలిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం/చోడవరం: రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బలిరెడ్డి సత్యారావుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. బలిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. విశాఖ ఆర్కేబీచ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిరెడ్డి సత్యారావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నగరానికి వచ్చారు. మహారాణిపేటలోని బలిరెడ్డి కుమార్తె నాగమణి నివాసానికి వెళ్లి.. ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం బలిరెడ్డి కుమార్తెలు కనకరత్నం, సరోజిని, సత్యవేణి, కోట్ని నాగమణి, అల్లుడు కె.ప్రసాద్, మనుమరాలు రామ సౌజన్యతో మాట్లాడారు.
ఆదివారం మిమ్మల్ని కలిసేందుకు పెద్దాయన (బలిరెడ్డి) వద్దామనుకున్నారనీ, కానీ మీరే రావాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదంటూ వారు కంటతడి పెట్టడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సీఎం జగన్ బలిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ సహాయమైనా సరే తనను సంప్రదించాలని సూచించారు. ఆ బాధ్యతను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాసు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, డా.భీసెట్టి వెంకట సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బలిరెడ్డికి నివాళులు అర్పించారు.
బలిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
బలిరెడ్డికి కన్నీటి వీడ్కోలు
బలిరెడ్డి సత్యారావుకు కుటుంబసభ్యులు, నేతలు, ప్రజలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన స్వగ్రామం చోడవరం మండలం పీఎస్‌పేటకు మృతదేహాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment