నేడు, రేపు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలు
అన్నవరం :
సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నుంచి రెండు రోజుల పాటు రత్నగిరిపై జరగనున్నాయి. శ్రావణ శుద్ధ విధియ, గురువారం నాటికి రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్బవించి 126 ఏళు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో, పూలమాలలతో అలంకరిస్తున్నారు.
నేడు అంకురార్పణ
సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కలశ స్థాపన చేస్తారు. ఈ సందర్బంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, మండపారాధన, ఆయుషూ్షక్తపారాయణ, గాయత్రి మంత్రజపం స్వామి, అమ్మవార్లకు మూల మంత్రజపములు, సువాసినీ పూజ, కుమారీ పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆషో్టత్తర శత కలశ మండపారాధన, అగ్నిమంధనం, హోమాలు జరుగుతాయి. రాత్రికి నీరాజన మంత్రపుష్పములు, స్వామి, అమ్మవార్లకు ప్రసాద నివేదన, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది.
గురువారం నాటి విశేషాలు..
గురువారం ఉదయం స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అనంతరం జపములు, పారాయణలు, ఆయుష్య హోమం నిర్వహిస్తారు. ఉదయం పది గంటలకు ఆయుష్య హోమం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం పండిత సత్కారం, వేదపండిత ఆశీస్సులు, నీరాజన మంత్రపుష్పములు, ప్రాకారసేవ నిర్వహిస్తారు. రాత్రి 7–30 గంటలకు కొండదిగువన వెండి గరుడ వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.