15 ఏళ్ల తరువాత ఆ ఇద్దరూ..
సినిమా అంటేనే మంచి, మనస్పర్థలు, ఈర్ష్య, అభిప్రాయభేదాలు, లాభనష్ట బేరీజులు, స్నేహాలు, సాయాలు ఇత్యాది అంశాల మయం. ఇక్కడ అందరికీ అన్ని ఉంటాయి. అలాగే ఎవరికీ ఏమీ ఉండవు. ఇదంతా ఎందుకు ప్రస్థావించాల్సి వచ్చిందంటే 15 ఏళ్ల క్రితం ధీనా అనే చిత్రంతో ఏఆర్.మురుగదాస్ అనే దర్శకుడు ఉదయించారు. ఈ చిత్రంలో కథానాయకుడు అజిత్. చిత్రం మంచి హిట్. దీంతో దర్శకుడికి ఎలానూ పేరు అవకాశాలు వస్తాయి. ఇకపోతే అప్పటి వరకూ లవర్‌బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్న అజిత్‌కు ధీనా చిత్రం కమర్షియల్ హీరోగా పేరు తెచ్చి పెట్టింది.
ఈ చిత్రం తరువాత ఆ ఇద్దరి కలయికలో చిత్రాలు చేయాలన్న ప్రయత్నాలు చాలా మంది చేశారు.అయితే ఏ ఒక్కటి సెట్ కాలేదు. ఇందుకు కారణాలు పలు ఉన్నా ఈగో ప్రధాన సమస్య అన్నది కోడంబాక్కమ్ వర్గాలు చెవులు కొరుక్కుంటన్న విషయం. ఇది ఎవరి మధ్య అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక తాజా విషయం ఏమిటంటే ధీనా చిత్ర కథానాయకుడు,దర్శకుడు 15 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి చిత్రం చేయనున్నార న్నది.
ఈ భారీ చిత్రాన్ని ఇంతకు ముందు కమల్, సూర్య వంటి హీరోలతో భారీ చిత్రాలను నిర్మించిన రెడ్ జెయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారు. అజిత్, మురుగదాస్ కాంబినేషన్లో చిత్రం చేయనున్నట్లు ఉదయనిధిస్టాలిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ అఖిరా హిందీ చిత్ర నిర్మాణంలో ఉన్నారు. అజిత్ సత్యజ్యోతి ఫిలింస్ సంస్థకు చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది గమనార్హం.