ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్‌బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్‌కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్‌లాగ్స్‌ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది.