28న సీఎం చంద్రబాబు రాక
రాజమండ్రిలో ‘జన్‌ధన్ యోజన’కు శ్రీకారం
గోదావరి పుష్కర సన్నాహాలపై సమీక్ష
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’కు రాజమండ్రిలో ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో ప్రతి కుటుంబానికీ ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీ) ఉండేలా, ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలతో వాటిని ఖాతాలు తెరిపించే లక్ష్యంతో కేంద్రం జన్‌ధన్ యోజనను ప్రవేశపెట్టింది.
మన రాష్ర్టంలో ఈ కార్యక్రమాన్ని తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖ, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి కుటుంబంలో భార్యాభర్తలిద్దరితో జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభింపచేసి, వారికి ఏటీఎం కార్డు తరహాలోనే రూపీకార్డు (స్వదేశీ ఏటీఏం కార్డు) జారీ చేస్తారు. దీనిని సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానం చేయనున్నారు. జన్‌ధన్ కింద బీమా సౌకర్యంతో పాటు ఆరునెలల తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి రాష్ర్టస్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడి ఈ నెల 28న శ్రీకారం చుట్టనుండగా అదేరోజు సాయంత్రం 4 గంటలకు లైవ్ టెలికాస్ట్ ఆన్లైన్ ద్వారా మన రాష్ర్టంలో సీఎం చంద్రబాబు రాజమండ్రి జేఎన్ రోడ్‌లోని చెరుకూరి కల్యాణమండపంలో ప్రారంభించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
కాగా ఈ పర్యటనలో సీఎం గోదావరి పుష్కర సన్నాహాలపై సమీక్షించనున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే (జూన్ 27న) చంద్రబాబు నగరం గ్రామంలో పైపులైన్ పేలుడు సృష్టించిన విషాదాన్ని చూసి, బాధితుల్ని పరామర్శించేదుకు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలలకు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన సన్నాహాలపై కలెక్టర్ నీతూప్రసాద్ మంగళవారం చెరుకూరి కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించ నున్నారు.