2014 బెస్ట్ ఆఫ్
2014కు వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన సమయం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాంకేతికరంగంలో జరిగిన మంచిని నెమరేసుకుంటూ కొత్త సంవత్సరంలో రాగల మరిన్ని సౌకర్యాలను, ఆనందాల కోసం ఆశగా ఎదురుచూడటం అందరూ చేసే పనే. ఇదే స్ఫూర్తితో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఈ ఏడాది అందరినీ అలరించిన మేటి అప్లికేషన్లు కొన్నింటిని మీకు అందిస్తున్నాం....
1. మెయిల్‌బాక్స్...
మెయిల్ ఇన్‌బాక్స్‌ను చక్కగా అమర్చకునేందుకు పనికొచ్చే ఆప్లికేషన్ ఇది. చిన్న స్వైప్‌తో అనవసరమైన మెయిళ్లను డిలీట్ చేయగలగడం, జీమెయిల్‌తో సులువైన ఇంటిగ్రేషన్, అంతగా అర్జెంట్ కాని మెయిళ్లను స్నూజ్ చేయగలగడం వంటి ప్రత్యేకతలు ఈ అప్లికేషన్‌ను ఈ ఏటి మేటి జాబితాలోకి చేర్చాయి.
2. హూ శాంపిల్డ్...
మీకు సంగీతమంటే ఇష్టమా... అయితే ఈ అప్లికేషన్ మీ కోసమే. వందల, వేల పా.టల సమాచారం తెలుసుకోవడంతోపాటు ఆయా పాటలను ఇతర రూపాల్లో (రీమిక్స్‌లు వగైరా) ఎలా వాడారన్న విషయాలను కూడా ఈ అప్లికేషన్లో కీవర్డ్లను సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్‌కు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ ఇటీవలే ఆండ్రాయిడ్‌లోనూ లభిస్తోంది.
3. సన్‌రైజ్ క్యాలెండర్...
గూగుల్ క్లౌడ్ క్యాలెండర్‌ను దీటైన ప్రత్యామ్నాయం ఇది. అపాయింట్మెంట్లను, రిమైండర్లను అందంగా అమర్చుకోవడం ఒక్కటే ఈ ఆర్గనైజర్ ప్రయోజనం కాదు. ఆయా అపాయింట్మెంట్లకు అనుబంధమైన సమాచారాన్ని కూడా అక్కడికక్కడే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఓ మీకు తెలియని ఓ ప్రాంతంలో మీటింగ్ అని అనుకుందాం. అక్కడికి ఎలా చేరాలో మ్యాప్ ద్వారా అక్కడే తెలుసుకోవచ్చు.
4. ఫైర్ ఛాట్...
ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా టెక్స్ట్ ఛాటింగ్‌కు అవకాశం కల్పించే అప్లికేషన్ ఇది. హాంకాంగ్‌లో ఈ ఏడాది సోషల్‌మీడియాపై ఆంక్షలు విధించినప్పుడు కూడా ఆందోళనకారులు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఫైర్ఛాట్ను ఉపయోగించారు. మిగలిన అప్లికేషన్లు ఏవీ పనిచేయకపోయినా ఇది మాత్రం నిక్షేపంగా పనిచేసిందని సమాచారం.
5. జీమెయిల్ ఇన్‌బాక్స్...
గూగుల్ అభివృద్ధి చేసిన జీమెయిల్ ప్రత్యామ్నాయమీ అప్లికేషన్. ముందుగా కేవలం ఇన్వైట్ల ఆధారంగా అందుబాటులోకి వచ్చినా ఆ తరువాత మామూలుగానే దొరికేలా ఏర్పాట్లు చేశారు. ఒకేరకమైన మెయిళ్లన్నింటినీ ఒకదగ్గరకు బండిల్ చేయడం మిగిలిన మెయిల్ అప్లికేషన్లను, ఇన్‌బాక్స్‌ను వేరుచేసే అంశం.
6. టింకర్...
చిన్న పిల్లలు సైతం కంప్యూటర్ కోడింగ్ ఎలా చేయాలన్నది సులువుగా తెలుసుకునేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. రకరకాల కోడింగ్ పజిల్స్‌తో కూడిన ఈ అప్లికేషన్లో సొంతంగా గేమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
7. వైర్....
టెక్స్ట్ మెసేజీలతోపాటు ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా వీడియోకాల్స్ చేసుకునేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. కాల్స్ ఎన్క్రిప్షన్ దీని ప్రత్యేకత. ఇదే తరహా సేవలందించే స్కైప్‌ను అభివృద్ధి చేసిన వారిలో ఒకరు వేరుగా దీన్ని తయారు చేయడం విశేషం.