తాగునీటిలో కోతి కళేబర అవశేషాలు
కళ్యాణదుర్గం : మున్సిపాలిటీ తాగునీటి పథకానికి సంబంధించిన నీటి ట్యాంకు కొళాయిల్లో చనిపోయిన కోతి శరీర అవశేషాలు రావడంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. రాచప్పకుంట వీధి సమీపంలోని మంజునాథ థియేటర్ వద్ద మున్సిపాలిటీ తాగునీటి ట్యాంకు ఉంది. సత్యసాయి పథకం ద్వారా ఈ ట్యాంకు నీరు సరఫరా చేస్తారు. ఈ ట్యాంకు ద్వారా చాప్పకుంట కాలనీలోని పబ్లిక్, ఇళ్ల కొళాయిలకు నీటిని సరఫరా అవుతుంది. రాచప్పవీధి కాలనీ ఇళ్లల్లోని తాగునీటి కొళాయిల్లో అవశేషాలు వచ్చాయి. వెంటనే కాలనీవాసులు మునిసిపల్ అధికారులకు తెలిపారు.
తాగునీటి పథకానికి సంబంధించిన ఎల్ఓ పైప్ ధ్వంసం చేసి అందులో ఇరుక్కుపోయిన కోతి కళేబారాన్ని బయటకు తీసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం రాద్ధాంతం కాకుండా వెనువెంటనే పైప్లైన్లు శుభ్రం చేసి నీటి ట్యాంకును శుభ్ర పరిచారు. సంబంధిత కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ నాయకుడు చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఆ కాలనీ వాసులు కూడా మున్సిపాలిటీ అధికారులను నిలదీశారు. నెలల తరబడి నీటి ట్యాంకును శుభ్రం చేయలేదని కౌన్సిలర్‌తో పాటు స్థానికులు వాపోయారు.