మిషన్‌లో వేగం పెంచండి
వికారాబాద్ అర్బన్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల వెంబడి పైపులైన్లు వేసేందుకు తవ్విన రోడ్లకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, గుంతలను వెంటనే పూడ్చి వేయాలని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరుకు పైపులైన్లు వేసి పనులు పూర్తి చేయాలని సూచించారు.
రోడ్లు తవ్వే సమయంలో ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తనను సంప్రదించాలన్నారు. జాతీయ రహదారుల వెంట పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్‌బీ ఈఈ ప్రతాప్, జాతీయ రహదారి ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్ రావు, వాటర్ గ్రిడ్ ఈఈ నరేందర్, ఇరిగేషన్ ఈ ఈ చంద్రశేఖర్, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.