పాక్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: పఠాన్ కోట్, ఉడీ ఉగ్రదాడుల సూత్రధారి, జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న 5100 మంది బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాల గుండా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ(నాక్టా)..ఆ మేరకు వాటిని స్తంభింపజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 5100 అకౌంట్లను స్తంభిపజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్ బీపీ) సోమవారం ఒక ప్రకటన చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం-1997ను అనుసరించి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. కేటగిరీలుగా విభజించిన అకౌంట్ల వివరాలను నాక్టా గత నెలలో ఎస్బీపీకి అందించిందని, మసూద్ అజార్ అకౌంట్ వివరాలను 'ఏ'కేటగిరిలో ఉంచినట్లు బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ప్రభుత్వం బ్లాక్ బ్యాంక్ అకౌంట్లలో 3,078 అకౌంట్లు ఒక్క ఖైబర్ ఫక్తుక్వా రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన 26 అకౌంట్లతోపాటు పంజాబ్ రాష్ట్రంలో 1,443, సింధ్ లో 226, బలూచిస్థాన్193, గిల్గిట్ 106, ఇస్లామాబాద్ కు చెందిన 27 మంది అకౌంట్లను అక్కడి ప్రభుత్వాలు స్తంభింపజేశాయి. ఉగ్రవాద నిర్మూలకు కట్టుబడి ఉంటామని అంతర్జాతీయ వేదికలపై ప్రకటించే పాకిస్థాన్.. ఉగ్రసంబంధిత అకౌంట్లను భారీగా స్తంభింపజేయడం ఇదే మొదటిసారి. అయితే అసలు ఉగ్రవాదులు మాత్రం పాక్ సైన్యం రక్షణలో స్వేచ్ఛగా జీవిస్తుండటం దాయాది ద్వంద్వస్వభావానికి నిదర్శనం.