రాజ్యసభ నుంచి ఆ నలుగురు అవుట్
తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైరాం రమేష్ (ఏపీ), జేడీ శీలం (ఏపీ), వీ హనుమంతరావు (తెలంగాణ)లకు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. వచ్చే జూన్ 21తో వీరందరి పదవీ కాలం ముగుస్తోంది. వీరితో పాటు తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుండు సుధారాణికి కూడా మరో అవకాశం లేనట్టే. టీడీపీకి చెందిన ఆమె ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ (బీజేపీ), యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జైరాం రమేష్, జేడీ శీలం పదవీ విరమణ చేయనున్నారు. అలాగే తెలంగాణ నుంచి వీహెచ్, గుండు సుధారాణి రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు ప్రకటించింది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి జూన్ 11న ఎన్నికలు నిర్వహిస్తారు.
అయితే ప్రస్తుతం ఏపీ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేకపోవడంతో ఆ పార్టీ పోటీ చేయడానికి కూడా చాన్స్ లేదు. ఇకపోతే తెలంగాణలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మినహాస్తే మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ రాజ్యసభ సీటును గెలుచుకునే అవకాశాలు లేవు. తెలంగాణలో ఏర్పడిన రెండు ఖాళీల్లో ఒక స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 40 తొలి ప్రాధాన్యత ఓట్లు రావాలి. టీడీపీలో మిగిలిన ముగ్గురు, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఇద్దరిని కలుపుకొన్నా కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం లేదు.
శాసనసభలో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాల మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఖాళీ అయిన రెండు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉండగా, ఏపీలో ఖాళీ అయిన నాలుగింటిలో మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగలుగుతుంది.