ఆ స్కూలు మొత్తానికి ఒకటే క్లాసు!!
ఏదైనా స్కూల్లో ఒకే ఒక్క తరగతి ఉండటం చూశారా? అది కూడా.. పదో తరగతి!! కానీ ఉంది. ఎక్కడంటారా? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వ పథకం కింద 2009లో అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఓ పాఠశాల నెలకొల్పారు. అక్కడ కేవలం పదోతరగతి మాత్రమే ఉంది. వాళ్లు ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు కూడా రాస్తున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు 54 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. అందరూ ఆరోతరగతిలోనే చేరారు. కానీ నాలుగేళ్ల నుంచి ఉన్నవాళ్లు తప్ప.. కొత్తగా ఎవరూ చేరలేదు. ఒక విద్యార్థి మానేశాడు కూడా. దాంతో ప్రతి ఏటా ఒక్కో తరగతి దాటుకుంటూ ఉన్న విద్యార్థులే వస్తున్నారు.
దాంతో తొలి సంవత్సరం ఆరోతరగతి, రెండో సంవత్సరం ఏడో తరగతి.. అలా ఇప్పటికి పదో తరగతికి చేరుకున్నారు. ఇక వచ్చే ఏడాది ఆ స్కూలు భవిష్యత్తు ఏంటో!! ఒకవేళ కొత్తగా విద్యార్థులు చేరినా కూడా వారికి పాఠాలు చెప్పడానికి తగినంత మంది టీచర్లు కూడా అక్కడ లేరట. 2009 తర్వాత అక్కడ కొత్తగా నియామకాలే జరగలేదు. దేశంలో తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో 100 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. వాటిలో రెండు అరుణాచల్ ప్రదేశ్కు మంజూరయ్యాయి. వాటి పరిస్థితి ఇలా ఉందన్నమాట!!