పాఠ్య పుస్తకాలకూ ఆధార్
సిద్దిపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయనున్న పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. పట్టణంలో మొత్తం 25 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలుండగా, మండలంలో మరో 29 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా, 2016-17 విద్యాసంవత్సరానికి ఆధార్ అనుసంధానంతో సుమారు 90 వేల పుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మూడు విడతల్లో 87,110 పుస్తకాలు రాగా, మరికొన్ని పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని కూడా విద్యాధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నారు.
ఆధార్ తో అక్రమాలకు అడ్డుకట్ట
గతంలో పాఠ్యపుస్తకాల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతికి నాంది పలికింది. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల ఆధార్ నమోదుకు అనుసంధానం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పుస్తకాలు అందించడమే కాకుండా, అక్రమాలకు తావివ్వరాదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పకడ్బందీగా పంపిణీ
పాఠ్యపుస్తకాలను పకడ్బందీగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాం. మూడు విడతలుగా పుస్తకాలు వచ్చాయి. పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. – ప్రసూనాదేవి, ఎంఈఓ