బాలుడిగా వెళ్లి..యువకుడిగా
12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసిన యువకుడు
బహదూర్‌పురా: తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు 12 ఏళ్ల తరువాత యువకుడిగా తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన గురువారం చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ ఇన్స్పెక్టర్ యాదగిరి వివరాల ప్రకారం... అంబర్పేట్ ప్రాంతానికి చెందిన శివ, అంజమ్మ దంపతుల కుమారుడు అంజనేయులు (21)ను 12 ఏళ్ల క్రితం మాట వినడం లేదని తండ్రి శివ తీవ్రంగా మందలించాడు. దీంతో అతను ఇంట్లో నుంచి పారిపోయి కాచిగూడలో రన్నింగ్ రైలు ఎక్కి చైన్నై చేరుకున్నాడు. ఆ తరువాత కుండుటూర్‌లో నేరస్తులతో సహవాసం చేశాడు. ఆటో డ్రైవర్‌గా, హోటల్ వెయిటర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి నేరాలకు పాల్పడేవాడు. అంతేగాకుండా వారితో కలిసి హత్యలో పాల్గొనడంతో అంజనేయులుకు నాలుగేళ్లు శిక్ష విధించినకోర్టు అతను మైనర్ కావడంతో జూవైనల్ హోమ్‌కు తరలించారు.
శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న అంజనేయులుకు స్కోప్ ఇండియా ఆర్గనైజేషన్ డెరైక్టర్ సత్తయ్యబాబు తమ సంస్థలో మూడు నెలల పాటు నేరవృత్తిని వదిలేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా తాము హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వారిగా చెప్పడంతో ఈ నెల 8వ తేదీన సత్తయ్య బాబు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు అంజనేయులను తల్లిదండ్రులు శివ, అంజమ్మలకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. 12 ఏళ్ల తరువాత వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.