ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహణ
పరీక్షలంటే ప్రశ్న పత్రాలను తయారు చేయటం నుంచి మొదలు పెడితే ముద్రణ, పరీక్షల నిర్వహణ, ఫలితాలు.. ఇలా చాలా వ్యవహారం ఉంటుంది. అయితే ఇవేవీ లేకుండా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే! అది కూడా క్లౌడ్ ఆధారంగా మొబైల్లో, డెస్క్‌టాప్‌లో కానిచ్చేస్తే!! దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకుంది స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్. కృష్ణ, కౌశిక్ చిత్రపు, ప్రదీప్ చేబోలు కలిసి రూ.10 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కేంద్రంగా స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్.కామ్‌ను ప్రారంభించారు.
మరిన్ని వివరాలివిగో...
♦ జీమ్యాట్, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం వంటి పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తున్న రోజులివి. ఇంకా చెప్పాలంటే ఎంసెట్, డైట్‌సెట్ సహా ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలు కూడా ఆన్లైన్లోనే నిర్వహించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మరి వీటిని ఎదుర్కొనే సామర్థ్యం మన విద్యార్థుల్లో ఉందా అంటే కాసేపు ఆలోచించే పరిస్థితి! ఎందుకంటే కళాశాలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదగలేదు. అందుకే అకాడమీని పూర్తి చేసుకొని బయటికొచ్చిన విద్యార్థులు ఆన్లైన్ పరీక్షల్లో పోటీపడలేకపోతున్నారు. దీనికి పరిష్కారం చూపించడమే స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్.కామ్ పని. అంటే ఆయా విద్యా సంస్థలకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసిస్తామన్నమాట.
♦ స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లౌడ్ ఆధారంగా మొబైల్ అండ్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం మా ప్రత్యేకత. ఉదాహరణకు ఆన్లైన్ పరీక్ష రాస్తున్న విద్యార్థి సరైన సమాధానమివ్వగానే ఆ తర్వాత వచ్చే ప్రశ్న కాసింత కష్టతరమైంది వస్తుంది. ఒకవేళ తప్పుగా ఇస్తే మరింత సులువైన ప్రశ్న వస్తుంది. దీంతో అప్పటికప్పుడే ఆ విద్యార్థి తనకుతానుగా నాలెడ్జ్‌ను తెలుసుకునే వీలుంటుంది.
♦ ప్రస్తుతానికి మా సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ వివిధ ఆల్గరిథంలపై 7 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతం కెనడాలోని మూడు కళాశాలలు మా సేవలను పొందుతున్నాయి.
♦ ఇటీవలే ఓ ప్రైవేట్ ఇన్వెస్టర్ సీడ్ లెవల్ ఫండింగ్‌లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. బెంగళూరు, ఆఫ్రికా, న్యూజెర్సీ ప్రాంతాల్లో కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించాం. ఇన్వెస్టర్లు ముందుకొస్తే ఫ్రాంచైజీ విధానంలోనూ ప్రారంభించేందుకు సిద్ధం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...