ప్రయాణికులకు మెరుగైన సేవలు : డీఆర్ఎం
విజయవాడ (రైల్వేస్టేషన్) :
ప్రయాణికులకు మరింత. మెరుగైన సేవలందిస్తామని డీఆర్ఎం అశోక్‌కుమార్ చెప్పారు. డీఆర్ఎం కార్యాలయంలో గురువారం 122వ డివిజనల్ రైలు ప్రయాణికుల సంఘం(డీఆర్‌యూసీసీ) సమావేశం జరిగింది. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు నంబరు 12795–12796 విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ, రైలు నంబరు 17215–17216 విజయవాడ–ధర్మవరం–విజయవాడ నూతన ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నామని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన 42 లక్షల మంది ప్రయాణికులకు మెరుగైన సేవలందించామని చెప్పారు. పుష్కర యాత్రికుల కోసం 650 ప్రత్యేక రైళ్లు నడిపామన్నారు. విజయవాడ స్టేషన్లో ఆర్ఆర్ఐ పనుల సమయంలోనూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి శాటిలైట్ స్టేషన్ల వద్ద బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని వివరించారు. విజయవాడ, అనకాపల్లి, గూడూరు, ఒంగోలు స్టేషన్లలో నూతనంగా ఐదు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో దువ్వాడ–గూడూరు మార్గంలో మూడో లైన్ పనులు చేపడతామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాక్ దెబ్బతిన్న చోట పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తిచేశామన్నారు. పలు స్టేషన్లలో వివిధ రైళ్లకు హాల్ట్ కల్పించాలని, సదుపాయాలు కల్పించాలని డీఆర్‌యూసీసీ సభ్యులు ఈ సందర్భంగా డీఆర్ఎంను కోరారు. ఈ సమావేశంలో ఏడీఆర్ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీసీఎం షిఫాలి, రైల్వే ఆస్పత్రి చీఫ్ సూపరింటెండెంట్ ఎన్సీ రావ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.