గెలుపు థానుదే
తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థానుకే పట్టం కట్టారు. తమిళ నిర్మాతల మండలి ఎన్నికలను ఆదివారం స్థానిక అన్నానగర్‌లో గల కందస్వామి కళాశాల ఆవరణలో నిర్వహించారు. కలైపులి ఎస్.థాను ఎఎల్ అళగప్పన్, మన్సూర్ అలీఖాన్, హండ్రి, గెటప్ రాజేంద్రన్ తదితర ఐదుగురు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఎ.కె.రాజన్ నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఐదుగురిలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ స్థితిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో విజయం నిర్మాత కలైపులి ఎస్.థానును వరించింది. మొత్తం 967 సభ్యులుండగా అందులో 565 మంది థానుకే ఆమోదముద్ర వేశారు. ఎఎల్అళగప్పన్కు 127 ఓట్లు, మన్సూర్ అలీఖాన్‌కు 29 ఓట్లు పడ్డాయి. ఇతర సభ్యుల వివరాలు సోమవారం వెల్లడించనున్నారు.
- తమిళసినిమా