జాగ్రత్తలతో మాతాశిశు మరణాల నివారణ
భీమవరం టౌన్: గర్భిణులు ఆరోగ్యçృరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ముందుగానే గుర్తించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే మాతాశిశువులు క్షేమంగా ఉంటారని సీనియర్ వైద్యులు తెలిపారు. భీమవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఐఎంఏ, గైనకాలజిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘అత్యంత ప్రమాదకరస్థితిలో గర్భం’ అంశంపై సదస్సు నిర్వహించారు.
ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ డీవీ చలపతిరావు, కార్యదర్శి డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, గర్భిణి, స్త్రీల వైద్య అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సుంకర నరసవాణి సదస్సుకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. విజయవాడకు చెందిన ఐవీఎఫ్ క్లినిక్ డాక్టర్ వి.పద్మజ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినపుడు శరీరంలో వ్యతిరేక కణాలు ఉత్పత్తి అయి కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నారు. శిశువు ఎదుగుదల లేకపోవడం, నెలలు నిండకుండానే ప్రసవం సంభవిస్తుందన్నారు. ఇటువంటి సమస్యలను ఏ విధంగా నివారించాలి, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వివరించారు.
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు వచ్చే షుగర్ వ్యాధుల గురించి వివరించారు.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గైనిక్ డిపార్ట్మెంట్ మాజీ హెచ్వోడీ డాక్టర్ కె.రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు అధిక రక్తపోటు ఏర్పడితే నియంత్రించేందుకు కనుగొన్న నూతన వైద్య పద్ధతులను వివరించారు. రాజమండ్రి తపని హాస్పటల్స్ డాక్టర్ డి.పద్మజ మాట్లాడుతూ ప్రసవం సమయంలో తల్లికి జరిగే ప్రమాదాలు, అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ ఇర్రింకి లక్ష్మి మాట్లాడుతూ గర్భస్రావానికి దారి తీసే పరిస్థితులు, నివారణ మార్గాలను తెలిపారు. ఏలూరు ఆశ్రం హాస్పటల్ గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ కె.వందన మాట్లాడుతూ ప్రసవానంతరం జరిగే రక్తస్రావాలు, దానికి కారణాలు, నివారణ మార్గాలు చెప్పారు. డాక్టర్ మేళం జగదీశ్వరి, డాక్టర్ సుంకర నరసవాణి తదితరులు మాట్లాడారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. జిల్లా నలుమూలల నుంచి గైనకాలజిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.