క్లౌడ్ నిపుణుల అడ్డా భారత్
న్యూఢిల్లీ: క్లౌడ్ నిపుణుల విషయంలో ప్రపంచంలో రెండవ కేంద్రంగా భారత్కు అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. ప్రభుత్వ, విద్య, నైపుణ్య కేంద్రాలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఇది సాధ్యపడుతుందని తెలిపింది. డ్రౌప్ సహకారంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. మూడవ స్థానంలో ఉన్న భారత్లో 2021 మార్చి నాటికి 6,08,000 మంది క్లౌడ్ నిపుణులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుంది. ఆ సమయానికి డిమాండ్ 20 లక్షలుగా ఉంటుంది. పెద్ద ఎత్తున నైపుణ్య కార్యక్రమాలు చేపడితే నిపుణుల సంఖ్య నాలుగేళ్లలో 18 లక్షలకు పెరుగుతుంది. 26 శాతం వార్షిక వృద్ధితో క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి రూ.41,510 కోట్లను తాకుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. నివేదిక రూపకల్పనలో టీసీఎస్, యాక్సెంచర్ సహకారం అందించాయి.
క్లౌడ్ సేవలకు డిమాండ్: డిజిటలీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక వసతులు, అనుకూలత, తక్కువ ఖర్చుల కారణంగా క్లౌడ్ వైపు చిన్న కంపెనీలు సైతం మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ మరో కారణం’ అని నాస్కామ్ వివరించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో నాస్కామ్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, క్లౌడ్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తోంది. క్లౌడ్ రంగంలో 2020లో 3,80,000 ఉద్యోగాల కోసం డిమాండ్ ఏర్పడింది. 2019తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. క్లౌడ్ నైపుణ్యాల డిమాండ్ ప్రస్తుత సరఫరాను మించిపోయింది. నైపుణ్యతపై దృష్టి పెట్టాలి అని నాస్కామ్ తెలిపింది.